వానాకాలం (ఖరీఫ్) పంటల సాగు సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాల ధరలు మండిపోతున్నాయి. ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా విత్తన ధరలు పెంచేశాయి. పత్తి తప్ప మిగతా పంటల విత్తన ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఒక్కో కంపెనీ ఒక్కోరీతిన ధరలు పెంచేస్తున్నాయి.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రాయితీ ధరలకు విత్తనాలను రైతులకు విక్రయించేది. ఇందుకోసం విక్రయ ధర ఎంత, ప్రభుత్వం భరించే రాయితీ ఎంతనేది నిర్ణయించేది. ఈ సీజన్‌లో రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. దీంతో విత్తన వాణిజ్య ధరలను రాయితీ లేకుండా అమ్మడానికి ‘రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’(టీఎస్ సీడ్స్) ఖరారు చేసింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినా పెరిగిన ఖర్చుల ప్రకారం ధరలను పెంచింది. ప్రైవేటు కంపెనీల సంగతి ఇక చెప్పనక్కర్లేదు.
బ్రాండు పేరు చెప్పి బాదేస్తున్నారు
రాష్ట్రంలో గతేడాది(2020) వానాకాలం సీజన్‌లో 53.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో వరి విత్తనాలకు డిమాండు పెరిగినందున సన్నరకాలైన సాంబమసూరి(బీపీటీ 5204) వరి విత్తన ధరను క్వింటాకు రూ.350 చొప్పున అదనంగా టీఎస్ సీడ్స్ పెంచేసింది. సాంబమసూరి.. తెలంగాణ సోనా.. కాటన్‌దొర సన్నాలు.. వీటి మూల విత్తనం ఒకటే అయినా ఒక్కో కంపెనీ ఒక్కో బ్రాండు పేరు పెట్టి ధరలు పెంచుతున్నాయి. టీఎస్ సీడ్స్ క్వింటా సాంబమసూరి విత్తనాల ధరను రూ.3450గా నిర్ణయించడంతో.. కొన్ని ప్రైవేటు కంపెనీలు రూ.4000- 4500 దాకా ధర చెబుతున్నాయి.