తెలంగాణ

telangana

ప్రవేశ పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనే!

By

Published : Jul 1, 2020, 8:52 AM IST

రాష్ట్రంలో ఎంసెట్‌ సహా వాయిదాపడిన ప్రవేశ పరీక్షలను మళ్లీ ఆగస్టు రెండో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉంది. అవి ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో నిర్వహణకు ఆగస్టు మొదటి వారం వరకు తేదీలు ఖాళీ లేవని ఉన్నత విద్యామండలి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సులు కావడంతో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించడం తప్పనిసరని, అలా కాదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

exams
exams

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. కరోనా కారణంగా వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ ఆగస్టు రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో ఆగస్టు మొదటివారం వరకు తేదీలు ఖాళీగా లేవని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ప్రవేశ పరీక్షలకు పరీక్షా కేంద్రాల ఎంపిక, వాటి నిర్వహణ, ఇతర సాంకేతిక ప్రక్రియలను టీసీఎస్‌ అయాన్‌ సంస్థ చేపడుతోంది. ఈనెల 18-23 తేదీల మధ్య జేఈఈ మెయిన్‌ నిర్వహిస్తామని గతంలోనే జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తేదీలు వెల్లడించింది. వాటినీ టీసీఎస్‌ అయానే నిర్వహిస్తోంది.

ఆగస్టు 10 వరకు ఖాళీలు లేవు

ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సంస్థ పరీక్షలకు సహకరిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఏపీలో జులై 27 నుంచి ప్రవేశ పరీక్షలు మొదలవుతాయి. ఈ క్రమంలో ఆగస్టు 10 వరకు తేదీలు ఖాళీగా లేవని సంస్థ ప్రతినిధులు ఉన్నత విద్యామండలికి ఇటీవలే చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో వారంలో మళ్లీ పరీక్షలు జరిపేందుకు వీలవుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.

ఇది రెండోసారి

ప్రవేశ పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. మొదట్లో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం మే 2న ఈసెట్‌, 4 నుంచి ఎంసెట్‌ జరగాలి. ఆ నెలాఖరుకు అన్నీ పూర్తయ్యేలా షెడ్యూల్‌ ఇచ్చారు. కరోనా కారణంగా వాయిదా వేసి జులై 1 నుంచి ప్రారంభమయ్యేలా తేదీలు ఖరారు చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడ్డాయి.

విద్యార్థులకు నరకమే

మార్చి మూడో వారంలో ఇంటర్‌(ద్వితీయ) పరీక్షలు పూర్తయ్యాయి. మే మొదటివారంలో ఎంసెట్‌, ఏప్రిల్‌లోనే జేఈఈ మెయిన్‌ రెండో విడత, మే నెలలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగాలి. ఇపుడు జూన్‌ పూర్తయింది. జులైలోనూ పరీక్షలు లేవు. మళ్లీ ఆగస్టులోనే జరుగుతాయి. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు మార్చి మూడో వారం నుంచే ఎంసెట్‌, నీట్‌ తదితరాలకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఆగస్టు అంటే అయిదు నెలలపాటు పరీక్షల ఆలోచనతోనే ఉండటం నరకప్రాయమే.

సెప్టెంబరు 1 నుంచి తరగతులు లేనట్లే

గత నెలలో యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 1 నుంచి ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావాలి. జూన్‌ 18న విద్యాశాఖ మంత్రి సమక్షంలో అధికారులు అదే నిర్ణయించారు. ఇప్పుడు ప్రవేశ పరీక్షే ఆగస్టు రెండో వారంలో జరిగితే ఫలితాలు ఇవ్వడం, కౌన్సెలింగ్‌ తదితర ప్రక్రియలు పూర్తికావాల్సి ఉన్నందున సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details