తెలంగాణ

telangana

ETV Bharat / city

సర్టిఫికెట్ల కోసం బీటెక్ విద్యార్థుల అవస్థలు.. - b.tech students suffers for certificates

కుటుంబ ఆర్థిక స్థోమత చాలక మధ్యలో చదువు మానేసే విద్యార్థి.. మొత్తం నాలుగు సంవత్సరాల ఫీజు ఎలా చెల్లించగలడన్న ఆలోచన లేదు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలకు, విద్యార్థి సర్టిఫికెట్లకు లంకె పెట్టడమేమిటన్న ధ్యాస లేదు. ఉద్యోగావకాశాలు అంతంతమాత్రంగా ఉన్న స్థితిలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఎలా బతుకుతారన్న మానవీయ కోణం అసలే లేదు. ఇదీ కొన్ని ఇంజినీరింగ్‌ కళాలల తీరు.

telangana engineering students who dropped in the middle suffering for certificates
సర్టిఫికెట్ల కోసం బీటెక్ విద్యార్థుల అవస్థలు..

By

Published : Mar 25, 2021, 9:09 AM IST

ఇంజినీరింగ్ విద్యార్థులు.. మధ్యలో చదువు మానేసే వారి సర్టిఫికెట్లు అడిగితే మిగిలిన సంవత్సరాలకూ ఫీజు చెల్లించాలంటూ కళాశాల యజమానులు ఇబ్బందిపెడుతున్నారు. ఏటా వేలాది మంది విద్యార్థులు ఈ సమస్యలతో సతమతమవుతున్నా, విద్యాశాఖ చోద్యం చూస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. గత అక్టోబరులో బీటెక్‌ పూర్తిచేసుకున్న వందలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ ఇంకా రానందున ఆ డబ్బు చెల్లించాలని, సొమ్ము అందిన తర్వాత మీకు చెల్లిస్తామని యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం సర్టిఫికెట్ల అంశం ఏటా తలనొప్పిగా మారింది.

నియంత్రణ సంస్థలు చెబుతున్నా..

విద్యార్థులు, అధ్యాపకుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కళాశాలల వద్ద ఉంచుకోవద్దని, వాటిని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలని యూజీసీ 2018లోనే ఆదేశాలు ఇచ్చింది. చదువు మానేసి వెళ్లిపోవాలనుకున్నా మిగిలిన సంవత్సరాల ఫీజు అడగరాదని స్పష్టంగా పేర్కొంది. ఏఐసీటీఈ కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా ఆ విషయాన్ని కళాశాలల అనుమతులకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌లో కూడా పొందుపరుస్తోంది. విద్యార్థుల నుంచి టీసీ మినహా ఒరిజినల్‌ సర్టిఫికెట్లేవీ తీసుకోవద్దని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సీటు కేటాయింపు లేఖలో కూడా ముద్రిస్తున్నారు. ఈ నిబంధనలను కళాశాలలు పట్టించుకోవడం లేదు. సమస్యకు పరిష్కారంగా స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనలు పొందుపరుస్తూ జీవో ఇవ్వాలని సాంకేతిక విద్యాశాఖ 2017లోనే ప్రతిపాదనలు పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని సమాచారం.

  • హైదరాబాద్‌ బాచుపల్లి ప్రాంతంలోని ఓ కళాశాలలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి బీటెక్‌లో చేరాడు. కుటుంబ సమస్యల వల్ల రెండో సంవత్సరం తర్వాత చదువు మానేశాడు. అతడి పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం వద్దే ఉన్నాయి. అవి ఇవ్వమని అడిగితే మిగిలిన రెండేళ్ల ఫీజు చెల్లించాలని సిబ్బంది తెగేసి చెప్పారు. ఏదైనా ఉద్యోగప్రయత్నం చేయాలన్నా సర్టిఫికెట్లు లేక ఆ విద్యార్థి సతమతమవుతున్నాడు.
  • వరంగల్‌కు చెందిన విద్యార్థి అదే జిల్లాలోని ఓ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. తనకు బీటెక్‌ ఒరిజినల్‌ డిగ్రీ (ఓడీ) సర్టిఫికెట్‌ కావాలని అడిగితే తమకు ప్రభుత్వం నుంచి బోధనా రుసుం అందలేదని, సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదని యాజయాన్యం స్పష్టం చేసింది. పదేపదే వేడుకోగా, జేఎన్‌టీయూ నుంచి బీటెక్‌ ఓడీ ఇప్పిస్తామని, పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు మాత్రం బోధనా రుసుం అందిన తర్వాతే ఇస్తామని తేల్చిచెప్పారు.
  • సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోటియాతండాకు చెందిన విద్యార్థి ఒకరు హైదరాబాద్‌ నాదర్‌గుల్‌ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌లో చేరాడు. రెండేళ్ల తర్వాత సబ్జెక్టులు పూర్తి చేయకపోవడంతో డిటెయిన్‌ అయి, చదువు మానుకున్నాడు. తన పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాలను అడిగితే మిగిలిన సంవత్సరాల ఫీజు చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఆ విద్యార్థి చేసేది లేక సొంతూరిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు.

సుప్రీంకోర్టు చెప్పినా పరిస్థితి మారలేదు

రెండు కళాశాలల ఫీజులకు సంబంధించి మా సంఘం తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశాం. ధ్రువపత్రాల విషయంలో రుసుములతో లింకు పెట్టి విద్యార్థులను వేధించవద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా పరిస్థితి మారలేదు. ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

- లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం

ABOUT THE AUTHOR

...view details