తెలంగాణలో వర్గ, లింగ భేదాలు లేకుండా బాలికలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర సర్కార్ కస్తూర్భా విద్యాలయాలను ఏర్పాటు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Education Minister Sabitha) అన్నారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇవి నడుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 391 కేజీబీవీలు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరో 84 పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Education Minister Sabitha) వివరించారు. ఇందులో 93 ఆంగ్ల, 379 తెలుగు, 3 ఉర్దూ మీడియాలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో లక్షా 10వేల మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నట్లు చెప్పారు. వీటిలో కొన్నింటిని అప్గ్రేడ్ చేసి కళాశాలలుగా మార్చినట్లు తెలిపారు.
2018-19 సంవత్సరంలో 84, 2019-20లో 88, 2020-21లో 26 కస్తూర్భా పాఠశాలలను ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసినట్లు మంత్రి(Telangana Education Minister Sabitha) చెప్పారు. వీటి కోసం రూ.296 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2021లో ఎంసెట్ పరీక్ష రాసిన 265 మంది కస్తూర్భా విద్యార్థుల్లో 225 మంది క్వాలిఫై అయినట్లు వెల్లడించారు.
"బాలికలకు విద్యతో పాటు ఉచిత భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థినులకు హెల్త్ కిట్స్ అందజేస్తున్నాం. రాష్ట్రంలోని గురుకుల, రెసిడెన్షియల్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో.. వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే మెనూ పాటిస్తున్నాం. వారంలో రెండు రోజులు మటన్, నాలుగు రోజులు చికెన్ పెడుతూ వారికి పోషకాహారం అందిస్తున్నాం. "