తెలంగాణ

telangana

ETV Bharat / city

తమను ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్ల విజ్ఞప్తి - coronavirus updates

కరోనా ప్రభావం క్యాబ్ డ్రైవర్లపై పడింది. కారు చక్రాలు తిరిగితేనే వారి జీవన బండి నడుస్తుంది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో క్యాబ్​లు పూర్తిగా రోడ్ ఆఫ్ అయిపోయాయి. రెక్కాడితే కానీ.. డొక్కాడని డ్రైవర్ల బతుకులు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రోజు వారి సంపాదన మీద ఆధారపడే వీరు ఇప్పుడు సంపాదన లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

cab
cab

By

Published : Apr 8, 2020, 2:36 PM IST

కరోనా దాటికి ప్రపంపచమే కుదేలైపోయింది. కరోనా కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం లాక్​డౌన్ అమలు చేస్తోంది. దాదాపు అన్ని వ్యాపార రంగాలు, పరిశ్రమలు మూతపడ్డాయి.. రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాబ్​లు అన్నీ.. ఇప్పుడు కేవలం ఇళ్లకే పరిమితమయ్యాయి. స్టీరింగ్ తిప్పితే తప్ప... పూట గడవలేని పరిస్థితులు వీళ్లవి. ఇప్పటి వరకు ఎలాగో నెట్టుకు వచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదంటున్నారు.

వారం ముందే తగ్గిన ఆదాయం

సాధారణ రోజుల్లో 12 గంటల నుంచి 24 గంటలు పనిచేస్తే.. ఒక్కో క్యాబ్ డ్రైవర్ రూ.800ల నుంచి రూ.1,200లు సంపాదించేవారు. లాక్​డౌన్​కు వారం ముందు నుంచే క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఆదాయం భారీగా పడిపోయింది. క్యాబ్​ల్లో ప్రయాణించే వారు తగ్గిపోవడంతో ఆదాయం సాధారణంగానే తగ్గిపోయింది. ఆ వారం రోజులు రూ.300ల నుంచి రూ.350లకు మించి కూడా సంపాదించలేకపోయామని డ్రైవర్లు వాపోయారు.

వెసులుబాటు కల్పించాలి

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి క్యాబ్​లు తమ ఇళ్ల ముందే పెట్టుకుంటున్నారు. క్యాబ్ బయటికి తీయలేక.. ఇళ్లు గడవలేక ఆర్థికంగా చితికిపోయారు. వీటికి తోడు వీరు కట్టాల్సిన కిస్తీల భారం పెరిగిపోతోందని, మూడు నెలల వరకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మూడు నెలల వరకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్​నెస్, రోడ్ ట్యాక్స్​, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఇంటి కిరాయిలు కట్టాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లోకి సరుకులు తీసుకురావాలంటే... జేబులో చిల్లిగవ్వ కూడా లేదని కూరగాయలు, పాలు కూడా కొనలేని స్థితికి చేరుకున్నామని డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఆర్థిక సాయం చేయాలి

కారు ఉందని వారి తెల్లకార్డులను తొలగించారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో వారి పూట గడవని పరిస్థితి నెలకొంది. డ్రైవర్లకు 12 కిలోల బియ్యం, రూ.1,500లు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్​లోని ఐటీ కంపెనీల్లోని వివిధ విభాగాల్లో క్యాబ్​లు నడిపిస్తున్నారు. ఆయా కంపెనీలు లాక్ డౌన్ నేపథ్యంలో తమను ఆదుకోవాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. ఓలా, ఉబర్ కంపెనీలు ఆరు నెలల వరకు 5శాతం కమీషన్ తగ్గించాలని కోరుతున్నారు. లాక్ డౌన్ సమయంలో క్యాబ్​లను రైడింగ్ సంస్థలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆ డబ్బులను తర్వాత వాయిదాల రూపంలో చెల్లిస్తామని పేర్కొంటున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ఆలోచన చేస్తున్నాయని.. ఆ తరహాలో తెలంగాణలో కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తమను ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్ల విజ్ఞప్తి

ఇదీ చూడండి:రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details