Current Charges Hike in Telangana:రాష్ట్రంలో సుమారు ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌పై 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్ పై రూ.1 చొప్పున విద్యుత్ ఛార్జీలను డిస్కంలు పెంచుకునేందుకు అంగీకరించామని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు.
డిస్కంల ప్రతిపాదనలపై వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుందని ఛైర్మన్ పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ 16 వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ... 14,237 కోట్ల రూపాయల గ్యాప్‌ను మాత్రమే కమిషన్ ఆమోదించిందని స్పష్టం చేశారు. డిస్కంలు 18శాతం ఛార్జీలు పెంపునకు ప్రతిపాదనలు సమర్పించగా... 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కమిషన్ అనుమతి ఇచ్చింది.
'వ్యవసాయానికి విద్యుత్ టారిఫ్ పెంచలేదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కేటగిరిలకు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదు. 200ల యూనిట్లలోపు వినియోగించే హెయిర్ కట్టింగ్ సెలూన్ కేటగిరీకి, ఎల్‌టీ 4లోని కుటీర పరిశ్రమవర్గానికి టారీఫ్ సవరించలేదు. ఓపెన్ యాక్సిస్ వినియోగదారులపై డిస్కంలు ప్రతిపాదించిన ఫెసిలిటేషన్ ఛార్జీలను కమిషన్ తిరస్కరించింది. హెచ్‌టీ కేటగిరి పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు గ్రీన్ టారీఫ్‌ను ప్రవేశపెట్టే డిస్కంల ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది.' - శ్రీరంగారావు, ఈఆర్సీ ఛైర్మన్
డిస్కంలు kwhకి రూ.2లు ప్రతిపాదించగా... kwhకి రూ.0.66గా కమిషన్ నిర్ణయించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్లపై గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు విధించే ప్రతిపాదనను వాయిదా వేసింది. ఈ విషయాన్ని గ్రిడ్ కో-ఆర్డినేషన్ కమిటీకీ పంపాలని నిర్ణయించింది.
కేటగిరీల వారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు
గృహవినియోగదారులకు :
- ఎల్‌టీ-1 ఏలో 50 యూనిట్ల వరకు రూ.1.40 నుంచి రూ.1.95కు పెంపు
- ఎల్‌టీ-1 ఏలో 51-100 యూనిట్ల వరకు రూ.2.60 నుంచి రూ.3.10కు పెంపు
- ఎల్‌టీ-1 బీలో 100 యూనిట్ల వరకు రూ.3.30 నుంచి రూ.3.40కు పెంపు
- ఎల్‌టీ-1 బీలో 101-200 యూనిట్ల వరకు రూ.4.30 నుంచి రూ.4.80కు పెంపు
- ఎల్‌టీ-1 బీ (2)లో 200 యూనిట్ల వరకు రూ.5 నుంచి రూ.5.10కు పెంపు
- ఎల్‌టీ-1 బీ (2)లో 201-300 వరకు రూ.7.20 నుంచి రూ.7.70 కు పెంపు
- ఎల్‌టీ-1 బీ (2)లో 301-400 వరకు రూ.8.50 నుంచి రూ.9కు పెంపు
- ఎల్‌టీ-1 బీ (2)లో 401-800 వరకు రూ.9 నుంచి రూ.9.50కు పెంపు
- ఎల్‌టీ-1 బీ (2)లో 800 యూనిట్లకు పైగా రూ.9.50 నుంచి రూ.10కు పెంపు