తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్​ ఛార్జీలు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు - తెలంగాణ కరెంట్ ఛార్జీలు

current
current

By

Published : Mar 23, 2022, 4:49 PM IST

Updated : Mar 23, 2022, 10:06 PM IST

16:47 March 23

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్​ ఛార్జీలు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్​ ఛార్జీలు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

Current Charges Hike in Telangana:రాష్ట్రంలో సుమారు ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్​పై 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్ పై రూ.1 చొప్పున విద్యుత్ ఛార్జీలను డిస్కంలు పెంచుకునేందుకు అంగీకరించామని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు.

డిస్కంల ప్రతిపాదనలపై వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుందని ఛైర్మన్ ​ పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ 16 వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ... 14,237 కోట్ల రూపాయల గ్యాప్‌ను మాత్రమే కమిషన్‌ ఆమోదించిందని స్పష్టం చేశారు. డిస్కంలు 18శాతం ఛార్జీలు పెంపునకు ప్రతిపాదనలు సమర్పించగా... 14 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు కమిషన్​ అనుమతి ఇచ్చింది.

'వ్యవసాయానికి విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదు. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్​ల కేటగిరిలకు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆమోదించలేదు. 200ల యూనిట్లలోపు వినియోగించే హెయిర్ కట్టింగ్ సెలూన్ కేటగిరీకి, ఎల్​టీ 4లోని కుటీర పరిశ్రమవర్గానికి టారీఫ్​ సవరించలేదు. ఓపెన్ యాక్సిస్ వినియోగదారులపై డిస్కంలు ప్రతిపాదించిన ఫెసిలిటేషన్ ఛార్జీలను కమిషన్ తిరస్కరించింది. హెచ్​టీ కేటగిరి పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు గ్రీన్ టారీఫ్​ను ప్రవేశపెట్టే డిస్కంల ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది.' - శ్రీరంగారావు, ఈఆర్సీ ఛైర్మన్

డిస్కంలు kwhకి రూ.2లు ప్రతిపాదించగా... kwhకి రూ.0.66గా కమిషన్​ నిర్ణయించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్లపై గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు విధించే ప్రతిపాదనను వాయిదా వేసింది. ఈ విషయాన్ని గ్రిడ్ కో-ఆర్డినేషన్ కమిటీకీ పంపాలని నిర్ణయించింది.

కేటగిరీల వారీగా పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు

గృహవినియోగదారులకు :

  • ఎల్‌టీ-1 ఏలో 50 యూనిట్ల వరకు రూ.1.40 నుంచి రూ.1.95కు పెంపు
  • ఎల్‌టీ-1 ఏలో 51-100 యూనిట్ల వరకు రూ.2.60 నుంచి రూ.3.10కు పెంపు
  • ఎల్‌టీ-1 బీలో 100 యూనిట్ల వరకు రూ.3.30 నుంచి రూ.3.40కు పెంపు
  • ఎల్‌టీ-1 బీలో 101-200 యూనిట్ల వరకు రూ.4.30 నుంచి రూ.4.80కు పెంపు
  • ఎల్‌టీ-1 బీ (2)లో 200 యూనిట్ల వరకు రూ.5 నుంచి రూ.5.10కు పెంపు
  • ఎల్‌టీ-1 బీ (2)లో 201-300 వరకు రూ.7.20 నుంచి రూ.7.70 కు పెంపు
  • ఎల్‌టీ-1 బీ (2)లో 301-400 వరకు రూ.8.50 నుంచి రూ.9కు పెంపు
  • ఎల్‌టీ-1 బీ (2)లో 401-800 వరకు రూ.9 నుంచి రూ.9.50కు పెంపు
  • ఎల్‌టీ-1 బీ (2)లో 800 యూనిట్లకు పైగా రూ.9.50 నుంచి రూ.10కు పెంపు

వాణిజ్యం

  • ఎల్‌టీ 2ఏలో 50 యూనిట్ల వరకు రూ.6 నుంచి రూ.7కు పెంపు
  • ఎల్‌టీ 2బీలో 100 యూనిట్ల వరకు రూ.7.50 నుంచి రూ.8.50 కు పెంపు
  • ఎల్‌టీ 2బీలో 101-300 యూనిట్ల వరకు రూ.8.90 నుంచి రూ.9.90కు పెంపు
  • ఎల్‌టీ 2బీలో 301-500 యూనిట్ల వరకు రూ.9.40 నుంచి రూ.10.40కు పెంపు
  • ఎల్‌టీ 2బీలో 500 యూనిట్లకు పైగా రూ.10 నుంచి రూ.11కు పెంపు

హోర్డింగ్స్‌

  • ఎల్‌టీ 2సీ విభాగంలో యూనిట్‌ ధర రూ.12 నుంచి రూ.13కు పెంపు

కమిషన్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. డిస్కంలు నవంబర్‌ 30లోపు ప్రతిపాదనలు కమిషన్‌ ముందు ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. పిటిషన్ల దాఖలుకు సమయపాలన కచ్చితంగా పాటించాలని అన్నారు. టూ-వే కమ్యూనికేషన్ సాంకేతికతను ఉపయోగించి 2 ఏళ్లలోగా 100 శాతం వ్యవసాయ రంగానికి డీటీఆర్ మీటరింగ్ సాధించాలని డిస్కంలను కమిషన్ ఆదేశించింది.

ఏటీ అండ్ సీ నష్టాలు 15 శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నష్టాలను తగ్గించేందుకు సర్కిల్, ఏరియాల వారీగా టైమ్ బౌండ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని డిస్కంలను కమిషన్ ఆదేశించింది. ఒకవేళ తగ్గించకపోతే... కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. ఏఆర్​ఆర్​లో నష్టాలను క్లెయిమ్ చేయడానికి డిస్కంలను కమిషన్ అనుమతించదని స్పష్టం చేసింది.

ఆసక్తిగల వినియోగదారులందరికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిస్కంలను కమిషన్ ఆదేశించింది. స్మార్ట్ గ్రిడ్ సౌకర్యాలను విస్తరించడానికి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని స్పష్టం చేసింది. జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్ట్​ను పూర్తిస్థాయిలో విస్తరించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న మీటర్లను స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో మార్చడానికి టైం బాండ్​తో కూడిన యాక్షన్ ప్లాన్​ను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

ఇదీ చదవండి :అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న మహిళ ముఖంపై మరిగే నూనె.. పోసింది ఎవరంటే.?

Last Updated : Mar 23, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details