రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
మతకల్లోలాలు సృష్టించే వారు ఎవరైనా వదలం: డీజీపీ - dgp mahender reddy on ghmc elections
గ్రేటర్ ఎన్నికల ఆసరాగా మతకల్లోలాలకు కుట్ర పన్నే విధ్వంసక శక్తులను పోలీస్ శాఖ అణచివేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే పోస్టులపై నిఘా పెడుతున్నట్లు తెలిపారు.

రాజకీయ నాయకుల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామన్న మహేందర్ రెడ్డి.. ఆ కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నగరంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 62 మందిపై కేసులు నమోదయ్యాయని, కొందరికి శిక్షలు కూడా పడ్డాయని వెల్లడించారు. ఓయూ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తేజస్వీ సూర్యపై కేసు నమోదు చేశామన్న డీజీపీ.. కుట్రలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని.. వివరాలు వెల్లడించలేమని చెప్పారు.
- ఇదీ చూడండి :'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'