తెలంగాణ

telangana

ETV Bharat / city

సైబర్ కేటుగాళ్ల నుంచి ఏడాదిలో రూ.15కోట్లు తిరిగొచ్చాయ్‌ - Cyber Crime Money recovered in Hyderabad

Cyber Crime Money Recovered : సైబర్ నేరాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. బాధితులు మోసపోయి వారి కష్టార్జితమంతా కోల్పోతున్నారు. మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కేటుగాళ్లను ట్రేస్ చేయడం పోలీసులకు ఇప్పటికీ సవాలే. కానీ నేరస్థులను పట్టుకోలేకపోయినా.. కోట్ల రూపాయలు మోసపోతున్న బాధితుల డబ్బును మాత్రం పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్(టీ4సీ) కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఈ ఏడాది కాలంలో టీ4సీ ఏకంగా రూ.15కోట్లకు పైగా సొమ్మును తిరిగి బాధితులకు అప్పగించింది.

Cyber Crime Money Recovered
Cyber Crime Money Recovered

By

Published : Jul 3, 2022, 10:41 AM IST

Cyber Crime Money Recovered : హైదరాబాద్‌కు చెందిన ప్రేరణను సైబర్‌ నేరస్థుల ముఠా బిట్‌కాయిన్‌ పెట్టుబడుల పేరుతో మోసం చేసి పలు ఖాతాలకు రూ.11లక్షలను బదిలీ చేయించుకుంది. ఆమె జూన్‌ 18న హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులతోపాటు తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(టీ4సీ)కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టీ4సీ బృందం ఐడీబీఐ బ్యాంకు నోడల్‌ అధికారులను సంప్రదించింది. రూ.11లక్షలను మోసగాళ్లకు చిక్కకుండా ఫ్రీజ్‌ చేయించి ఆ డబ్బుని తిరిగి బాధితురాలి ఖాతాకు రప్పించారు. ఇలా ఏడాది కాలంలో టీ4సీ ఏకంగా రూ.15కోట్లకుపైగా సొమ్మును తిరిగి బాధితుల చెంతకు చేర్చింది.

Telangana Cybercrime Coordination Centre : సైబర్‌నేరాలు పెచ్చరిల్లిపోవడంతో కేంద్ర హోంశాఖ www.cybercrime.gov.in వెబ్‌సైట్‌తోపాటు హెల్ప్‌లైన్‌ నంబరు 1930ని ఏర్పాటు చేసింది. ఇదేక్రమంలో తెలంగాణ పోలీసులు టీ4సీని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో సిబ్బంది 24గంటలూ అందుబాటులో ఉంటుండటంతో తెలంగాణ నుంచి 1930కు వచ్చే ఫోన్‌కాల్స్‌కు వెంటనే స్పందిస్తున్నారు.

సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌తో అనుసంధానం..దేశవ్యాప్తంగా బాధితుల నుంచి హెల్ప్‌లైన్‌ నంబరుకు వచ్చే ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌) ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఆయా రాష్ట్రాల సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు.

సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ సిబ్బంది బాధితుల వివరాలు అన్ని బ్యాంకులతోపాటు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సంస్థల నోడల్‌ అధికారులకు వెంటనే చేర్చుతున్నారు. దీంతో సైబర్‌ నేరస్థుల ఖాతాలకు బదిలీ అయిన సొమ్మును డ్రా చేయకుండా ఫ్రీజ్‌ చేయించగలుగుతున్నారు. తెలంగాణలో టీ4సీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా రూ.15,47,61,501లను బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు.

ABOUT THE AUTHOR

...view details