రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతుల గోడును స్వయంగా పరిశీలన చేయాలని గవర్నర్ తమిళసైకి కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతురావు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మూడు పేజీల వినతపత్రాన్ని గవర్నర్‌కు అందించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, డబ్బులు తక్షణమే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెప్పారు. పంటల సాగు విషయంలో రైతులను కట్టడి చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. మూడు చట్టాలను వాపస్ తీసుకున్నట్లు.. యాసంగి వరి పంటను కొనుగోలు చేయమన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేంతవరకు ఆందోళన చేపడతామని తెలిపారు.