తెలంగాణ

telangana

ETV Bharat / city

రణరంగమైన ఛలో రాజ్​భవన్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు

congress protest at raj bhavan : కాంగ్రెస్‌ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోనియా , రాహుల్‌గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ..ఏఐసీసీ పిలుపు మేరకు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్లను దాటుకొని రాజ్‌భవన్‌వైపు నేతలు, కార్యకర్తలు దూసుకెళ్లగా... పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి సహా నేతలను అరెస్ట్‌ చేశారు.

congress protest at raj bhavan
congress protest at raj bhavan

By

Published : Jun 16, 2022, 1:38 PM IST

Updated : Jun 16, 2022, 8:46 PM IST

congress protest at raj bhavan : హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఖైరతాబాద్‌ కూడలికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నేతలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు, శ్రేణులు కూడలిని పూర్తిగా ఆక్రమించారు. ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. పంజాగుట్ట వైపు నుంచి వచ్చిన బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేశారు. ప్రయాణీకులను కిందకు దించి.. బస్సులపైకి ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ద్విచక్రవాహనం తగులబడుతున్న సమయంలో...ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. బస్సు ఎక్కిన వారిని కిందకు దించే క్రమంలో ఒకరు కిందకు దూకడంతో.. అతడికి గాయాలయ్యాయి.

ముట్టడి కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాజ్‌భవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. బారికేడ్లను పక్కకు నెట్టేసి రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు ముళ్లకంచె వేశారు. అడగుడుగునా అడ్డుపడుతున్నా.. ఛేదించుకుని ముందుకు వెళ్లారు. వారిని ఒక్కసారిగా పెద్దసంఖ్యలో చుట్టముట్టిన పోలీసులు.. నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, సునీతారావు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిని గోషామహల్ పీఎస్‌కు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేష్ కుమార్‌ను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించిన సమయంలో తీవ్ర ప్రతిఘటన చోటు చేసుకుంది. ఆయన్ను అరెస్టు చేయకుండా నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. రేవంత్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్తుండగా... వాహనం ముందుకు కదలకుండా బండరాళ్లు అడ్డుపెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. మరికొందరు పోలీసు వ్యాన్‌ పైకి ఎక్కారు. దీంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు... ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం నేతలను పోలీసుస్టేషన్‌కు తరలించారు.ఆందోళనలో భాగంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్సు అద్దాలు ధ్వంసం చేయడంపై డ్రైవర్ పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

రణరంగమైన ఛలో రాజ్​భవన్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అరెస్టు సమయంలో పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనంలోకి ఎక్కించేటపుడు భట్టి విక్రమార్కను వెస్ట్‌జోన్‌ డీసీపీ నెట్టివేశారు. డీసీపీని అదే స్థాయిలో నేత భట్టి తిరిగి నెట్టారు. మరోవైపు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు కాలర్ పట్టుకుని లాగారు. అనంతరం ఆమెను పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్​కు తరలించారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని తప్పుపట్టిన నేతలు... తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపు రాష్ట్రంలోని అన్ని కేంద్ర కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు: ఛలో రాజ్​ భవన్​ ముట్టడిలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్కపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లు రవి, శ్రీధర్‌బాబు, సునీతారావు, వీహెచ్, అన్వేష్‌రెడ్డిపై కూడా కేసు నమోదైంది. బలరాం నాయక్, మోత రోహిత్, అనిల్‌కుమార్‌ సహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో 200 మంది నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Jun 16, 2022, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details