తెలంగాణ

telangana

ETV Bharat / city

మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. రేవంత్​పై జగ్గారెడ్డి నిప్పులు.. కాంగ్రెస్​లో ఏం జరుగుతోంది..?

Congress Internal differences: "అందరిది ఓ గొడవైతే.. ఆయనది మరో గొడవ" అన్నట్టుంది కాంగ్రెస్​ పరిస్థితి. రాష్ట్రంలో హాట్రిక్​ కొట్టాలని తెరాస.. ఈసారి ఎలాగైన అధికారం దక్కించుకోవాలని భాజపా శతవిధాల ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్​ మాత్రం అంతర్గత విభేదాలతో ఆయాసపడుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీ ఓ గాడిన పడుతోందనుకునే లోపే.. మరోసారి అభిప్రాయభేదాలు తెరమీదికొచ్చాయి. దీనంతటికి కారణం.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా హైదరాబాద్​కు రావటమే మరీ..

Telangana Congress Internal differences came on screen one more time and jaggareddy fire on revanthreddy
Telangana Congress Internal differences came on screen one more time and jaggareddy fire on revanthreddy

By

Published : Jul 2, 2022, 7:58 PM IST

Congress Internal differences: రాష్ట్రంలో తెరాస, భాజపా రాజకీయం రసవత్తరంగా నడుస్తోన్న క్రమంలో.. కాంగ్రెస్ మాత్రం మళ్లీ అంతర్గత విభేదాల ఉచ్చులో చిక్కుకుంది. గతంలో నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలతో అపసోపాలు పడ్డ హస్తం.. ఈ మధ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకుని గాడిలో పడ్డట్టయింది. అసమ్మతి రాగాలు.. అభిప్రాయభేదాలు.. నేతల మధ్య కుమ్ములాటలన్నింటిని పక్కనపెట్టి అందరూ ఒకే తాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తామని బల్లగుద్ది కూడా చెప్పారు. ఇంకేముంది ఇక కాంగ్రెస్​ నేతలంతా ఒక్కటయ్యారు.. ఇక తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకుంటుందనుకునేలోపే.. అవన్నీ ఉట్టి మాటలేనని మరోసారి నిరూపితమైంది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హా హైదరాబాద్​ పర్యటన సందర్భంగా.. కాంగ్రెస్​ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరమీదికొచ్చాయి. సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కరవైంది. కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యస్వంత్ సిన్హాను కలిస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని.. ఎట్టిపరిస్థితుల్లో కలవకూడదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కేసీఆర్​ను కలిసిన నేతను కలవబోయేదిలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పదేపదే చెబుతూవచ్చారు. కేసీఆర్​ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హానే కాదు.. బ్రహ్మ దేవుడినైనా కలిసేది లేదని తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే.. అధిష్ఠానం నిర్ణయానికి భిన్నంగా పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ బేగంపేటలో సీఎం కేసీఆర్‌తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ అంశం పార్టీలో అగ్గిరాజేస్తోంది. మరోవైపు.. యశ్వంత్ సిన్హాను సీఎల్పీ పక్షాన ఆహ్వానించి మద్దతు పలికి ఉండాల్సిందని జగ్గారెడ్డి కూడా తన మనసులోని మాటను బహిరంగంగానే వెలిబుచ్చారు. దీంతో ఇన్ని రోజులు లోలోపల కప్పిపెడుతున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

ఇదే విషయమై రేవంత్​ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకపోతే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా కలిస్తే తమకు సంబంధం లేదని పార్టీ ప్రతినిధిగా కలిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పలువురు నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ అధిష్ఠానం అన్ని రకాలుగా చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కితే సహించేది లేదని.. ఎవరిష్టమున్నట్టు వాళ్లు చేస్తామంటే కుదరదని సీరియస్​గా వార్నింగ్​ ఇచ్చారు. నియమనిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

ఇప్పటికే రేవంత్​రెడ్డిపై అసమ్మతి రగులుతోన్నా అధిష్ఠానం కోరిక మేరకు నిశ్శబ్దంగా ఉన్న జగ్గారెడ్డి.. ఈ మాటలు విని మరోసారి భగ్గుమన్నారు. రేవంత్​రెడ్డిపై ఉన్న అక్కసునంతా మరోసారి బయటపెట్టారు. రేవంత్‌ వచ్చిన తర్వాత పార్టీకి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో రేవంత్‌ తీస్మార్‌ఖాన్‌లా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే నిప్పులు చెరిగారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ అని అభిప్రాయం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. రేవంత్‌ను పీసీసీ నుంచి తప్పించాలని హైకమాండ్‌ను కోరతానని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశి అగ్గిరాజేశారు.

"ఓపిక లేని వ్యక్తి పీసీసీ చీఫ్​గా ఉండడానికి ఆర్హుడు కాదు. నాలుగు నెలలుగా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడకుండా ఉన్నా. ఇప్పుడు రేవంత్‌ రెడ్డినే నన్ను రెచ్చగొట్టాడు. రేవంత్‌ రెడ్డిని పీసీసీ పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తా. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా విషయంలో ఆయనను కలవాలని కానీ.. కలవరాదని కానీ ఎలాంటి నిర్ణయం పార్టీలో తీసుకోలేదు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి వచ్చిన తరువాత పార్టీకి వచ్చిందేమీ లేదు. ఆయన లేకపోయినా పార్టీని నడిపించగలం. పీసీసీ ఒక్కడే ప్రభుత్వం తీసుకొస్తాడా.? పార్టీలో ఉంటూ.. పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారా..? యశ్వంత్‌ సిన్హాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు కలవడంలో తప్పేముంది. వీహెచ్‌ అంటే ఎవరో తెలియదని పీసీసీ చీఫ్ ఏలా అంటారు..? పార్టీలో ఉన్న వారంతా పాలేర్లు కాదు. అందరం కలిసి పని చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని మరచిపోరాదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన శత్రువు భాజపా. ఆ తరువాతే తెరాస. యశ్వంత్ సిన్హాను కలవొద్దని మాకు ఎలాంటి సమాచారం లేదు. కనీసం ఓటు ఉన్న వాళ్లకు కూడా చెప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులు అన్న పదాన్ని రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత.. కోవర్టుగా మార్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో చేరికల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డమ్మీ చేసి.. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్‌ గాంధీకి గతంలో మాట ఇచ్చాను. ఆ మాట తప్పినందుకు రాహుల్‌ గాంధీకి క్షమాపణలు చెబుతా. పార్టీ వీడే ప్రసక్తి లేదు." - జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

రెండుసార్లు అధికారం చేపట్టి హాట్రిక్​ కోసం తెరాస ఓవైపు.. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలని జాతీయ కార్యవర్గాన్నే తెలంగాణకు రప్పించిన భాజపా మరోవైపు పోటాపోటీగా కృషిచేస్తుంటే.. కాంగ్రెస్​ మాత్రం అంతర్గత విభేదాలను పరిష్కరించుకోలేక తిప్పలుపడుతోంది. చూడాలి మరీ.. ఇది ఇక్కడితోనే సమసిపోతుందో.. చిలికిచిలికి గాలివానలా మారుతుందో..! మళ్లీ దిల్లీ అధిష్ఠానం చొరవ తీసుకునే పరిస్థితి వస్తుందో వేచి చూడాల్సిందే..!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details