CM KCR Jharkhand Tour: గాల్వాన్ అమరులకు ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా మరో 19 మంది వీరమరణం పొందారు. సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
2020 జూన్ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్‌బాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిహారంతో పాటు సంతోష్‌బాబు సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.