తెలంగాణ

telangana

ETV Bharat / city

సచివాలయం నమూనాలో మార్పులు.. వచ్చే వారం ఆమోదం..! - telangana new secretariat news

ఆరు అంతస్థులు... ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం... ప్రార్థన మందిరాలు, బ్యాంకులు.. ఇదీ కొత్త సచివాలయ భవన స్వరూపం. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబిస్తూ 14 అంతస్థుల ఎత్తులో భవనం మధ్యలో పెద్ద గుమ్మటం రానుంది. ఈ నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని మార్పులు సూచించారు. అందుకు అనుగుణంగా నమూనాను రూపొందించాలని ఆదేశించారు.

telangana cm kcr made changes in new secretariat design
సచివాలయం నమూనాలో మార్పులు.. వచ్చే వారం ఆమోదం..!

By

Published : Jul 23, 2020, 9:50 PM IST

నూతన సచివాలయం నమూనా ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 25 ఎకరాల్లో 20 శాతం విస్తీర్ణాన్ని భవనం కోసం వినియోగించనున్నారు. పాత భవనాలన్నీ పూర్తిగా నేలమట్టమై, వ్యర్థాలన్నింటినీ తరలించాక సచివాలయ నిర్మాణం కోసం భూమిని పూర్తిగా చదును చేస్తారు.

హుస్సేన్ సాగర్​కు అభిముఖంగా..

నూతన సచివాలయం చుట్టూ నలుమూలల్లో 60 అడుగుల వెడల్పుతో రహదార్లను అభివృద్ధి చేస్తారు. మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించనున్నారు. హుస్సేన్ సాగర్​కు అభిముఖంగా దీర్ఘ చతురస్రాకారంలో భవనం ఉంటుంది.

ఆరు అంతస్థుల భవనం మధ్యలో 14 అంతస్థుల ఎత్తులో గుమ్మటం వచ్చేలా నమూనా సిద్ధం చేశారు. ఆరు అంతస్థుల భవనం పైన నాలుగు అంతస్థుల మేర ఆఫీస్ స్పేస్ ఉండేలా నిర్మించనున్నారు. ఆపైన మరో నాలుగు అంతస్థుల ఎత్తులో గుమ్మటం ఉంటుంది. ఈమేరకు చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్​లు ఆస్కార్, పొన్ని రూపొందించిన నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని మార్పులు సూచించారు. అందుకు అనుగుణంగా నమూనాను రూపొందించాలని ఆదేశించారు.

వచ్చే వారం నమూనాకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కొత్త సచివాలయం నిర్మాణానికి రూ. 500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సచివాలయానికి ఉత్తర, తూర్పున రహదారులు ఉన్నాయి. అదే తరహాలో పశ్చిమ, దక్షిణ వైపునా రోడ్లు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. దక్షిణ వైపు రహదారి వైపుగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతారు. ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, తపాలా కార్యాలయం, ఆస్పత్రి, చిన్నారుల సంరక్షణా కేంద్రం, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, సందర్శకుల గది వంటి నిర్మాణాలు అందులో ఉంటాయి. సచివాలయ తుది నమూనా ఖరారవ్వగానే అంచనాలు రూపొందించనున్నారు.

నమూనాకు తుది ఆమోదం పొందిన వెంటనే టెండర్లు పిలిచేందుకు రహదారులు, భవనాల శాఖ సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో తక్కువ కాలవ్యవధికి టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పది నెలల్లో కొత్త సచివాలయ భవనాన్ని పూర్తిచేసేలా షరతు విధించనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నాటికి కొత్త సచివాలయం సిద్ధం కావాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ఇవీచూడండి:'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details