తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రాడ్యుయేట్​ ఓటర్లకు ఫోన్​చేయనున్న సీఎం కేసీఆర్‌! - telangana latest news

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయంగా రంగంలోకి దిగిన సీఎం, పార్టీ అధినేత కేసీఆర్​.. రెండు స్థానాల్లోనూ గులాబీ అభ్యర్థులే గెలివాలని పార్టీ శ్రేణులకు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రానికి రప్పించేలా కృషి చేయాలని ఆదేశించారు. వివిధ వర్గాలకు చెందిన ఓటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఫోన్లో మాట్లాడనున్నారని తెలుస్తోంది.

telangana cm kcr likely to call graduate voters
గ్రాడ్యుయేట్​ ఓటర్లకు ఫోన్​చేయనున్న సీఎం కేసీఆర్‌!

By

Published : Mar 2, 2021, 7:17 AM IST

గ్రాడ్యుయేట్​ ఓటర్లకు ఫోన్​చేయనున్న సీఎం కేసీఆర్‌!

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎప్పటికప్పుడు నేతలను సమాయత్తం చేస్తున్నారు. ప్రచార శైలిపై దిశానిర్దేశం చేయడం సహా.. క్షేత్రస్థాయి తీరుపై ఇన్‌ఛార్జీలతో మాట్లాడుతూ కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే కొందరు ఓటర్లతో సీఎం ఫోన్లో మాట్లాడనున్నారని తెలుస్తోంది. పట్టభద్రుల్లో... యువత, పీజీ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర వృత్తి నిపుణులను ఎంపిక చేసుకుని వారికి కాల్ చేయనున్నట్లు సమాచారం.

దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి..

ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై ముఖ్యనేతలతో సమీక్షించిన కేసీఆర్​.. ఆరు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్‌ఛార్జీలతో ఫోన్లో మాట్లాడారు. 12 రోజులే సమయం ఉన్నందున ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అభ్యర్థుల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, వారిని గెలిపించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. విపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ప్రచార సరళిని తెలుసుకున్నారు. ప్రచారం తీరుపై నివేదించాలని మంత్రులను ఆదేశించారు.

కేటీఆర్‌ సైతం..

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సైతం పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరును కలిసి మద్దతు సమీకరించాలని నేతలకు సూచించారు. ఎవరికి వారు తానే అభ్యర్థి అన్నట్లుగా భావించి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ స్థానంపై ఆయన సమీక్షించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 17 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను పార్టీ ఇన్​ఛార్టీలుగా నియమించారు.

ఇవీచూడండి:ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: ఏపీ ఎస్ఈసీ

ABOUT THE AUTHOR

...view details