ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన TIMS Hospitals Foundation: రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనికోసం భాగ్యనగరంలో మరో మూడు నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నలుమూలల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరిట ఆసుపత్రులను నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే ఇవాళ నగరంలోని మూడు ప్రాంతాల్లో మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి భూమిపూజ KCR at GaddiAnnaram TIMS Hospital Foundation: ముందుగా ఎల్బీనగర్ పరిధిలోని గడ్డిఅన్నారం వద్ద నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన కేసీఆర్ గడ్డిఅన్నారానికి చేరుకున్నారు. సీఎం ప్రత్యేక పూజలు చేసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ మేయర్, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. 21.36 ఎకరాల విస్తీర్ణంలో.. 14 అంతస్తుల్లో నిర్మించేందుకు సర్కారు ఈ ఆసుపత్రికి 900 కోట్లు కేటాయించింది.
ఎర్రగడ్డ టిమ్స్ :ఎల్బీనగర్ ఆసుపత్రి శంకుస్థాపన అనంతరం ఎర్రగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్.. సనత్‌నగర్ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించనున్న వేయి పడకల టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ ఆసుపత్రిని 17 ఎకరాల్లో 14 అంతస్తుల్లో నిర్మిస్తారు. ఇందుకోసం సర్కారు 882 కోట్లు మంజూరు చేసింది.
అల్వాల్ టిమ్స్ : ఎర్రగడ్డ నుంచి అల్వాల్ బయలుదేరిన ముఖ్యమంత్రి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అక్కడికి చేరుకున్నారు. అల్వాల్‌లో నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ హాస్పిటల్ కోసం రూ.897 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వెయ్యి పడకల సామర్థ్యం :కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో ఆసుత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో సర్కారు నిర్మించనుంది. ఫలితంగా వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసిన వైద్యారోగ్యశాఖ.. ఇందుకు తగిన ఏర్పాట్లు ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఆసుత్రులకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకురానున్న టిమ్స్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఇప్పటికే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. అల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆస్పత్రితో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు.. ఎల్బీనగర్ (గడ్డి అన్నారం) ఆస్పత్రి ద్వారా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల వారికి.. గచ్చిబౌలి, సనత్‌నగర్ ఆస్పత్రులతో సమీప జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఇవీ చదవండి :