వ్యవసాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందన్నారు.
'రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ప్రకృతి కూడా సహకరిస్తోంది. విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మి తెలంగాణలో 4 ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. 6 ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి వచ్చింది. ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా వచ్చింది. రాష్ట్రంలో కోటి 29 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. యాసంగిలో 65 లక్షల ఎకరాలు సాగులో ఉంది. నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం... నీటి తీరువా పన్నే లేదు.'
- సీఎం కేసీఆర్
మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబందు..
దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు. గతంలో సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం చేశామని.. దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని సీఎం స్పష్టం చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ తెరాస ప్రభుత్వమే ఉంటుంది, దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళితబంధు పథకానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం.. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేదేనని సీఎం కేసీఆర్ తెలిపారు.
'రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నా. దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగింది. పరిస్థితుల మేరకు బడ్జెట్ అంచనాలు సవరించి నిధులు కేటాయించడం ఆనవాయితీ. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉంది. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నాం. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉంది. అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాం.'
- సీఎం కేసీఆర్
cm kcr speech in assembly: 'మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తాం' 75 ఏళ్ల స్వాతంత్య్రానికి తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని వాపోయారు. స్వాతంత్య్రానికి ముందు కూడా వారు హింసకు గురయ్యారన్నారు.
రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని కేసీఆర్ కొనియాడారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్‌కు ఉండాలని అంబేడ్కర్ చెప్పారన్నారు.. కేసీఆర్. అంబేడ్కర్ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. అంబేడ్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు.
అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూరలేదన్న సీఎం.. గత ప్రభుత్వాలు కొంత చేశాయన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పరిపాలించలేదన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు.
ఇదీచూడండి:Minister KTR at Council: 'కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యే'