CM KCR inaugurates Banjara Bhavans : రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగిడిన సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించారు. సంత్ సేవాలాల్, కుమురంభీం భవనాలను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి.. గిరిజన, ఆదివాసీ బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. రూ.21 కోట్ల 71 లక్షలతో బంజారాలకు సంతు సేవాలాల్ భవనాన్ని, రూ.21 కోట్ల 50 లక్షలతో ఆదివాసీలకు కుమురం భీం భవన్‌ని సకల సౌకర్యాలతో నిర్మించారు. రెండు భవనాలను కలియ తిరిగిన ముఖ్యమంత్రి కమ్యూనిటీ హాళ్లు అద్భుతంగా ఉన్నాయని అధికారులను ప్రశంసించారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలు ఈ భవనాల వేదికగా మరింత ప్రగతిబాటలో నడవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
KCR inaugurates Banjara Bhavans : 'బంజారాహిల్స్‌లో బంజారాలకే చోటు లేకుండా పోయింది' CM KCR inaugurates Banjara Bhavans in Hyderabad : బంజారా, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండు భవన్‌లు ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలని అభిలషించారు. విద్య, పోడు భూములు తదితర విషయాల్లో కొంత పురోగమించినప్పటికీ.. ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయన్నారు.
Banjara Bhavans inauguration in Hyderabad : దేశ, విదేశాల్లోని గిరిజనులంతా లంబాడ భాష మాట్లాడటం విశేషమన్న సీఎం.. దేశంలో ఉన్న గిరిపుత్రులందరికీ సమాన హోదా కోసం జాతీయ స్థాయిలో పోరాడాలని పిలుపునిచ్చారు. లంబాడాల అభివృద్ధి కోసం నిర్మాణాత్మక చర్చలకు బంజారా భవన్ వేదిక కావాలని ముఖ్యమంత్రి కోరారు.
"హైదరాబాద్‌లో బంజారాహిల్స్ అనే పెద్ద ప్రాంతం ఉంది కానీ అక్కడ బంజారాలకు చోటు లేదు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారు. దేశవ్యాప్త బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలి. తెరాస జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత విధానం తెస్తాం. త్వరలో పోడుభూముల సమస్య పరిష్కరించనున్నాం. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి. బంజారా, ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించాం. బంజారాలకు ఏ కష్టమొచ్చినా ఈ భవనం నుంచి ఆదుకోవాలి. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలి."- సీఎం కేసీఆర్
అంతకుముందు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బంజారా భవన్ వద్ద గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.