CM KCR PRESSMEET: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా.. రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. వారి నిర్ణయాలన్నీ మధ్యతరగతి ప్రజలపై భారం వేసేవేనని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(KCR ON KISHAN REDDY) ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న కేసీఆర్.. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాతావరణం బాయిల్డ్ రైస్(Boiled rice)కే అనుకూలమని వాదన వినిపించాలని సూచించారు.
KCR on paddy: దేశంలో ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత కేంద్రానిదేనని సీఎం స్పష్టం చేశారు. సేకరించిన ఆహార ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేసేది కేంద్రమేనని చెప్పారు. ఇప్పుడు ధాన్యం కొనబోమని కేంద్రం నిరాకరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయోమయ ప్రకటనలతో రైతులను గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు. భాజపా.. ప్రతి విషయాన్ని లాభనష్టాలతో బేరీజు వేసుకుంటోందని ఆరోపించిన సీఎం.. ప్రజలను కాపాడాలనే సామాజిక బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. నిర్వహణ సామర్థ్యం లేని భాజపా తమపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాయిల్డ్ చేయకపోతే బియ్యం ఉత్పత్తి సగానికి తగ్గిపోతుందని వివరించారు.
'గత యాసంగి ధాన్యమే కేంద్రం పూర్తిగా తీసుకోలేదు. గత యాసంగిలో రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని.. మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రంతో లేఖ రాయించుకున్నారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కోరాం. రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగి పంట బాయిల్డ్ రైస్‌కే అనుకూలం. బాయిల్డ్ రైస్‌ను గతంలో ఎఫ్‌సీఐ ప్రోత్సహించింది.'