నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వయసేమీ మీరలేదు. నేనే సీఎంగా ఉంటానని శాసనసభ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు? నేను రాజీనామా చేయాలని చూస్తున్నారా? ఇంకోసారి అలా మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతా. ఆయన సీఎం, ఈయన సీఎం అని ఎక్కడైనా అనవసరంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా.
-ముఖ్యమంత్రి కేసీఆర్
మరో పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. దీని గురించి ఎవరూ అనవసర వ్యాఖ్యలు చేయవద్దన్నారు. గీతదాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలుంటాయన్నారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని.. పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో తెరాస చిరకాలం ఉంటుందని, కొత్త పార్టీలకు అవకాశం లేదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, పార్టీ రాష్ట్రకమిటీ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో తొలుత నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటం వద్ద సీఎం నివాళులర్పించారు. పార్టీవర్గాల సమాచారం మేరకు.. సమావేశం ఆరంభంలోనే ఆయన ముఖ్యమంత్రి మార్పు గురించి వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు.
పార్టీ అంటే పాన్‌షాపు పెట్టడం కాదు
‘‘తెలంగాణ ప్రజల చిరకాలవాంఛను నెరవేర్చేందుకు తెరాస ఏర్పడింది. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని ముద్దాడాం. పార్టీకి బలమైన పునాది ఉంది. 90 శాతానికిపైగా ప్రజాప్రతినిధులు తెరాసవారే. ప్రజల ఆదరాభిమానాలతో చిరకాలం కొనసాగుతాం. పార్టీ అంటే పాటలు పాడటం, పాన్‌షాపులు పెట్టడం కాదు. బలమైన నిర్మాణం కావాలి. దాని అవసరం ఏర్పడాలి. తగిన వ్యూహంతో నడవాలి. గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయాయి. దేవేందర్‌గౌడ్, నరేంద్ర, విజయశాంతి, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా వాటి ఆనవాళ్లు లేవు. దొమ్మాటలో రామచంద్రారెడ్డి అనే నాయకుడు తెలుగుదేశంలో ఉండేవారు. ఆయన ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి జానారెడ్డి పెట్టే పార్టీకి వెళతానంటే నేను వద్దని బతిమిలాడాను. వినకుండా పోయి నష్టపోయారు. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారు. దారితప్పిన వారి పరిస్థితి అదే అవుతుంది. తెరాస తెలంగాణ ప్రజల అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక. మనకు పార్టీయే ప్రాణం. దానిని కాపాడుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలి.
మరింత బలంగా పార్టీ
తెరాస ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. పార్టీకి ప్రస్తుతం 60 లక్షల సభ్యత్వం ఉంది. ఈ నెల 12 నుంచి 15 రోజుల పాటు పెద్దఎత్తున సాగాలి. ప్రతి నియోజకవర్గానికి 50 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలి. ప్రతి నెలా జిల్లాల్లో పార్టీ సమీక్షలు జరగాలి. వచ్చే రెండు నెలలు నేను అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తాను. పార్టీ నేత ఇంట్లోనే బసచేసి అందరితో సమావేశమవుతాను.
20 ఏళ్ల ఉత్సవాలు
పార్టీ ఇరవై ఏళ్ల ఉత్సవాలను భారీగా జరుపుతాం. ఆవిర్భావ దినాన 6 లక్షలమందితో సభ పెడతాం. ఏ జిల్లా వారు దాన్ని నిర్వహించడానికి ముందుకొస్తే అక్కడే దానిని నిర్వహిస్తాం. మార్చి 1 నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తాం. నమ్ముకున్న వారికి పార్టీ న్యాయం చేస్తుంది. పదవుల కోసం ఓపికతో ఉండాలి. అటూ ఇటూ చూస్తే మిగిలేది బూడిదే. పదవులను ఆశించకుండా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసేందుకూ నేతలు ముందుకురావాలి.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పది వేల కోట్లు