తెలంగాణ

telangana

ETV Bharat / city

మిగులు ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి? - తెలంగాణలో వ్యవసాయ వార్తలు

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా.. ఇంతవరకు పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించలేదు. ఫలితంగా కొనుగోళ్లు ప్రారంభమైనా మిగులు ధాన్యాన్ని ఎక్కడికి పంపాలనే దానిపై అధికారులకు స్పష్టత లేదు. ప్రభుత్వం కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల అధికారుల్లో అయోమయం నెలకొంది.

grain collection in telangana
మిగులు ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి?

By

Published : Apr 16, 2021, 9:49 AM IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా కార్యాచరణ ప్రణాళిక మాత్రం ఖరారు కాలేదు. కొన్నదానిలో మిగులు ధాన్యాన్ని ఎక్కడికి పంపాలో అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏయే మిల్లులకు ఎన్ని క్వింటాళ్లు పంపాలి.. వేటిని బ్లాక్‌ లిస్టులో పెట్టారు? తదితర సమాచారం లేక క్షేత్రస్థాయి అధికారుల్లో అయోమయం నెలకొంది.

ప్రతిసారి సీజను ఆరంభానికి ముందే పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. గత ఏడాది ఏప్రిల్‌ 4నే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈసారి ఇంతవరకు రాలేదు. గోనె సంచుల టెండర్లు సైతం ఖరారు కాలేదు. ప్రస్తుతం ఉన్న గోనె సంచుల నిల్వలు కాస్త అటూ ఇటుగా నెల రోజులు వస్తాయని సమాచారం. ఇప్పటికే మిల్లర్ల వద్ద గత యాసంగి ధాన్యం నిల్వలు ఉన్నాయి. తాజా నిల్వలు కూడా వస్తే ఎక్కడ ఉంచాలో అర్థం కావడంలేదు. గతంలో ఆరు బయటే ధాన్యం నిల్వ చేయడంతో అకాల వర్షాలకు మొలకలొచ్చేశాయి. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మిల్లులు తక్కువ.. కొనుగోళ్లు ఎక్కువ

ప్రభుత్వం కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల అధికారుల్లో అయోమయం నెలకొంది. ఈ వానాకాలంలో 1.32 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వ అంచనా. అందులో 80 నుంచి 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని నిర్ణయించింది. ఈ సీజనులో వచ్చే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. మిల్లర్లు ఇందులో ఎక్కువశాతం ఉప్పుడు బియ్యంగా మారుస్తారు.

జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు..

రాష్ట్రంలో 2,400 వరకు ధాన్యం మిల్లులు ఉండగా వాటిలో 934 మాత్రమే ఉప్పుడు బియ్యం మిల్లులు ఉన్నాయి. పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుండటంతో మిల్లింగ్‌ కూడా అధికారులకు తలకుమించిన భారమే. ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాల్లో రెండు మాత్రమే ఉప్పుడు బియ్యం మిల్లులున్నాయి. ఆ రెండింటికీ అదనంగా కేటాయించినా 15 నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నులు మిల్లింగ్‌ చేయటమే కష్టం. ఆ జిల్లాలో 50 నుంచి 60 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు దిగుబడి వస్తుంది. పది, పదిహేను రోజులుగా కొనుగోళ్లు జరుగుతున్నా అదనపు ధాన్యాన్ని ఎక్కడికి పంపాలని జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితే మరికొన్ని జిల్లాల్లోనూ ఉన్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం సేకరణ కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేయకపోతే పరిస్థితులు ఇబ్బందికరంగా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి:రాయితీల కోత.. ఎరువుల వాత

ABOUT THE AUTHOR

...view details