Telangana Civil Supplies Corporation : ధాన్యం కొనుగోళ్ల కోసం తీసుకున్న అప్పు చెల్లించే విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నలుగుతున్న వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విభజన 2014లో జరిగినప్పటికీ పౌరసరఫరాల సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు సమయం పట్టింది.
తెలంగాణకే వెళ్లింది..
Civil Supplies Corporation Telangana :ధాన్యం కొనుగోళ్ల కోసం సీజను ఆరంభ సమయంలో బ్యాంకుల కన్సార్షియం నుంచి అప్పులు తీసుకోవటం పరిపాటి. 2017 మేలో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ రూ.మూడు వేల కోట్లకుపైగా రుణం తీసుకుంది. 2018 సెప్టెంబరులో ఆ మొత్తాన్ని చెల్లించాలి. అయితే ఇప్పటికీ రూ.626.81 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పు తమ రాష్ట్రం పేరుతో ఉన్నప్పటికీ విభజనలో భాగంగా ఆ బకాయి తెలంగాణకు వెళ్లిందని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల అధికారులతో ప్రతి ఏటా కన్సార్షియం సమావేశం నిర్వహిస్తుంది. తాజాగా గతనెలలో చండీగఢ్‌లో నిర్వహించింది. అందులో తెలుగు రాష్ట్రాల అప్పుల వ్యవహారంపై సమీక్ష జరిగింది.
భిన్నాభిప్రాయాలున్నాయి..
‘తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వ్యవహారం కొలిక్కి వచ్చినా కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చెల్లించాల్సిన మొత్తంలో మిగిలిన రూ.354.08 కోట్ల అసలు మాత్రమే చెల్లిస్తాం’ అని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ స్పష్టం చేసింది. ‘అసలు చెల్లించేందుకు తెలంగాణ అంగీకరించినప్పుడు వడ్డీ బాధ్యత కూడా ఆ ప్రభుత్వానిదే. ఆర్‌బీఐ రుణం మంజూరు చేసే నాటికి రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ రుణంతో తమకు సంబంధం లేద’ని ఏపీ స్పష్టం చేసింది. ‘ఈ వ్యవహారం ప్రభావం అప్పులు తీసుకునే ఇతర రాష్ట్రాలపైనా పడుతోంది. తక్షణం రుణం చెల్లించే అంశాన్ని తేల్చుకోవాలి’ అంటూ పంజాబ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.