ధాన్యం కొనుగోళ్లపై భాజపా, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెడుతోందని.. క్షేత్రస్థాయి పరిశీలనలో తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. 12 జిల్లాల్లో ఎఫ్‌సీఐ గోదాముల వద్ద 800 లారీల పడిగాపులు కాస్తున్నాయని చెప్పిన మారెడ్డి.. గోదాముల సామర్థ్యం, రవాణా వేగవంతం చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రతిపైసా తామే ఇస్తున్నామని.. కేంద్రం, భాజపా నేతలు చెబుతున్నారని.. కానీ వాస్తవ ధరలకు.. కేంద్రం ఇచ్చే ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. హమాలీ ఛార్జీల కింద కేంద్రం తెలంగాణకు 5.60 రూపాయలు ఇస్తోందని.. అదే పంజాబ్‌లో 24.25 రూపాయలు ఇస్తున్నారని మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణకు ఒకటి.. పంజాబ్‌కు మరో న్యాయమా అని మారెడ్డి ప్రశ్నించారు.
civil supplies corporation chairman news: వ్యాగన్ మూమెంట్, గోదాముల సామర్థ్యం పెంచితే తక్షణమే యాసంగి ధాన్యం సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతుకు ఇబ్బంది కలగకూడదని.. ముఖ్యమంత్రి తపిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఇబ్బంది పడతారనే వరిసాగుపై ముందస్తు ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బియ్యం రీసైక్లింగ్ ఆరోపణల పైనా మారెడ్డి స్పందించారు. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.