ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గతేడాది యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 64.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం. తాజాగా ఈ యాసంగిలో దాన్ని బ్రేక్ చేస్తూ 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఈ యాసంగిలో ఇంకా 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. 10 లక్షల మంది రైతుల నుంచి 12,247 కోట్ల విలువ చేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... గతేడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తైంది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసింది.
Paddy Purchase : వ్యవసాయమంటే దండుగ కాదు.. పండుగ - Telangana Civil Supplies Corporation chairman
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానిది.. కేవలం ఏడేళ్లల్లో తెలంగాణలో సుసాధ్యమైంది. పౌరసరఫరాల సంస్థ ఈ యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి గత ఏడాది రికార్డు తిరగరాసింది.
నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే సాధ్యమైందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఏడేళ్లలో భారతదేశమే అబ్బురపడే విధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించారని తెలిపారు. వ్యవసాయమే సాధ్యం కాదన్న చోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండించి చూపించారని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో మద్ధతు ధరకు కొనుగోలు చేయడంలో సీఎం రైతులకు అడుగడుగునా అండగా నిలిచారని శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం ఏర్పడడం వల్ల రైతులు ఎంతో ఆత్మవిశ్వాసంతో పంటలు పండిస్తున్నారని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతితో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత పరిస్థితి గమనిస్తే ధాన్యం కొనుగోళ్లలో సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్లు కనబడుతోందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా... నేడు 67 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.