వచ్చే నెల ఒకటో తేదీ ప్రారంభమయ్యే మరో దఫా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అనంతరం నిర్దేశించిన ఏ పని కూడా పెండింగ్లో ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, అటవీ అధికారులు, డీఆర్డీవోలు, అధికారులతో ప్రగతిభవన్లో సమావేశమైన సీఎం... కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా కూడా పనులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయో అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున ఇంటింటికీ పంపిణీ చేసి నాటించాలని తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలకచట్టాల ప్రకారం పల్లెలు, పట్టణాల్లో జరిగే లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
KCR Review: జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు - cm kcr review on urban development
10:23 June 26
జులై 1 నుంచి పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు
రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి..
గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు పవర్ డేను పాటించాలని, ప్రజలను చైతన్య పరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందిన పరిస్థితుల్లో వ్యవసాయం, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడాలని సీఎం కేసీఆర్ తెలిపారు. పంటల దిగుబడి బాగా పెరిగి దేశ ధాన్యాగారంగా మారిన పరిస్థితుల్లో రాష్ట్రానికి అదనపు రైసు మిల్లులు తక్షణ అవసరమని అన్నారు. రైసు మిల్లుల సంఖ్యను పెంచాలని చెప్పారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లను 250 ఎకరాలకు తక్కువ కాని విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి... వాటి చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు.
కల్తీ విత్తనాలను అరికట్టాలి..
కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని... వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలను అరికట్టాలని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. పోడుభూముల సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్ధిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి : నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..