తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: పరీక్షలు లేకుండానే 'పది' విద్యార్థులు ప్రమోట్

పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతికి పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్గత మార్కుల ఆధారంగా వారికి గ్రేడ్లు కేటాయించి పదో తరగతి సర్టిఫికెట్‌ అందజేయాలన్నారు.

telangana chief minister kcr clarifies that ssc students will be promoted without exams
పరీక్షలు లేకుండానే 'పది' విద్యార్థులు ప్రమోట్

By

Published : Jun 9, 2020, 6:39 AM IST

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈక్రమంలో పరీక్షలపై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పదో తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్రంలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏలు)ల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణనలోకి తీసుకొని పైతరగతికి పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఆ పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వాటి నిర్వహణకు సంబంధించి భవిష్యత్తు పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌, ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details