Telangana Celebrate Holi Festival: రంగుల పండుగను.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సందడిగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హోలీ సంబురాలు సందడిగా సాగాయి. రంగుల వేడుకతో బేగంబజార్‌లోని మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపించాయి. అధిక సంఖ్యలో మార్వాడీలు ఒకచోట చేరి... రంగులు పూసుకుంటూ సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగ జరుపుకున్నారు. యువతీయువకులు, మహిళలు, చిన్నారులు చిన్నాపెద్ద తేడా లేకుండా... నృత్యాలు చేస్తూ... సంబురాల్లో మునిగితేలారు.
బురదలో చిందులు వేస్తూ..
ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పీపుల్స్ ప్లాజాలో జరిగిన వేడుకల్లో యువత టమాటాలతో కొట్టుకుంటూ... బురదలో చిందులు వేశారు. బిగ్‌బాస్ ఫేం హిమజ హోలీ సంబురాల్లో పాల్గొని... యువతీయువకులతో కలిసి డప్పు కొడుతూ సందడి చేశారు. బేగంపేట కంట్రీక్లబ్, మాదాపూర్‌లో యువతీయువకులు ఒక్కచోటుకు చేరి హోలీ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. డీజే హోరు, రెయిన్ డ్యాన్స్‌తోపాటు... రంగులు విరజిమ్ముతూ నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగిపోయారు.
కేరింతలు కొడుతూ..
హోలీని పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు పెద్దసంఖ్యలో హైదరాబాద్ వాసులు తరలివచ్చారు. కుటుంబసమేతంగా రావడంతో చిన్నారులతో జలవిహార్ ప్రాంతం కిటకిటలాడింది. రంగులు లోపలికి అనుమతించకపోవడంతో... వాటర్ ఫౌంటెన్‌లో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు.