తెలంగాణ

telangana

ETV Bharat / city

బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే! - తెలంగాణ కేబినెట్ సమావేశం

కొత్త సచివాలయ భవన నమూనా దాదాపుగా ఖరారైంది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నమునాకు తుది ఆమోదం తెలిపి పనులు ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. నియంత్రిత సాగు, కరోనా పరిస్థితులు, నివారణా చర్యలతో పాటు విద్యారంగానికి సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనుంది. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.

kcr
kcr

By

Published : Aug 1, 2020, 8:36 PM IST

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల ఐదో తేదీన సమావేశం కానుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో కేబినెట్ భేటీ జరగనుంది. వాస్తవానికి అదే రోజూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదించింది. అయితే ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశం అసౌకర్యంగా ఉంటుందని, 20వ తేదీ తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఐదో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై ప్రధానంగా చర్చించనుంది.

నమూనపై కసరత్తు

పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. మరోవైపు కొత్త సచివాలయ భవన నమూనాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్​లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలుగా నమూనా విషయమై సమీక్షించారు. చెన్నెకి చెందిన ఆర్కిటెక్ట్​లు ఆస్కార్, పొన్ని రూపొందించిన నమూనా దాదాపుగా ఆమోదం పొందింది. భవన ముందుభాగ నమూనాకు దాదాపుగా ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్... లోపల కార్యాలయాలు, విస్తీర్ణం, వెడల్పు, సంబంధిత ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అందుకు సంబంధించిన కసరత్తు చేసి మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. భవన సముదాయ నమూనా దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కేబినెట్ భేటీలో దానిపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. భవన నమునాకు ఆమోదం తెలిపి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కరోనాపై చర్చ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కూడా కేబినెట్ చర్చించనుంది. జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ వైద్యకళాశాలల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కొవిడ్ వల్ల విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు, సహా విద్యాసంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పంట కొనుగోళ్లపై చర్చ

నియంత్రిత సాగుపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. వానాకాలం పంట నుంచే నియంత్రిత పద్ధతిలో సాగు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన పంటల వివరాలను ఇప్పటికే సేకరించారు. పంటల మార్కెటింగ్, అమ్మకాలు, కొనుగోళ్ల విషయమై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో నియంత్రిత సాగు కోసం కూడా కసరత్తు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. నీటిపారుదల శాఖ పేరును జలవనరులశాఖగా మార్చాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్... శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. దానిపై కూడా మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీలు ఎవరికి

గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేసే వారి విషయమై కూడా కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. రాములు నాయక్​పై అనర్హతా వేటు పడగా నాయని నర్సింహారెడ్డి పదవీకాలం పూర్తయింది. కర్నె ప్రభాకర్ పదవీకాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తవారిని నియమించే విషయమై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details