తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా నేడు మంత్రివర్గ భేటీ - tsrtc strike latest updates

ఆర్టీసీ సమస్య ముగింపే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. కార్మికులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై కూడా మంత్రివర్గం దృష్టి సారించనుంది.

telangana cabinet meeting today to discuss
ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా నేడు మంత్రివర్గ భేటీ

By

Published : Nov 28, 2019, 4:22 AM IST

Updated : Nov 28, 2019, 7:41 AM IST

ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా నేడు మంత్రివర్గ భేటీ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా ఇతర డిమాండ్లతో ఆర్టీసీ కార్మికుల ఐకాస చేపట్టిన సమ్మె నుంచి నెలకొన్న అనిశ్చితి ఇంకా వీడలేదు. 52 రోజుల పాటు చేసిన సమ్మెను విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినప్పటికీ యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకోలేదు. విధులకు అనుమతించాలంటూ కార్మికులు డిపోల వద్దకు వచ్చినా ఫలితం లేదు. గత రెండు రోజులుగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్యను ముగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సమావేశపరిచారు. ప్రగతి భవన్ వేదికగా ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది.

కార్మికుల్లో ఉత్కంఠ...

కేబినెట్​ భేటీలో ఇతర అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఆర్టీసీపైనే విస్తృతంగా చర్చించనున్నారు. 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులు ఇవ్వాలని గతంలోనే కేబినెట్ తీర్మానించింది. ఫలితంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గనుంది. అపుడు ప్రస్తుతం ఉన్నంతమంది కార్మికుల అవసరం పడరు. ఈ నేపథ్యంలో కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

సమ్మె కార్మిక న్యాయస్థానానికి వెళ్లేనా...?

హైకోర్టు ఆదేశాల మేరకు సమ్మె వ్యవహారం కార్మిక శాఖ కమిషనర్​కు చేరింది. కార్మిక న్యాయస్థానానికి పంపుతారా.. లేదా కమిషనర్ స్థాయిలోనే తేల్చుతారా అన్నది కూడా తేలాల్సి ఉంది. కార్మికశాఖ కమిషనర్ వద్ద ప్రక్రియ పూర్తయ్యే వరకు అందరూ సంయమనం పాటించాలని ఎండీ సునీల్ శర్మ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న విషయమై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నివేదికలు సిద్ధం...

ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన సమగ్ర వివరాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. సంస్థ పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, ఆస్తులు, అప్పులతో పాటు కార్మికుల వివరాలను ఇందులో పొందుపర్చినట్లు సమాచారం. కార్మికుల సంఖ్య, ఏడాది వారీగా పదవీవిరమణ చేసే వారి సంఖ్యను కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులకు సంబంధించిన ప్రక్రియ, ఇతర అంశాలకు సంబంధించి రవాణాశాఖ అధికారులు అవసరమైన నివేదిక సిద్ధం చేశారు. వీటన్నింటి ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీ, ప్రజారవాణాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

కార్మికులను ఉంచుతారా..?

కార్మికుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది అత్యంత కీలకంగా మారింది. కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా... లేదా అన్నది తేలాల్సి ఉంది. తీసుకుంటే ఎలాంటి షరతులు పెడతారన్న విషయమై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వీటితో పాటు కార్మికుల సంఖ్యను తగ్గించాలనుకుంటే ఏ విధానాన్ని అవలంభిస్తారన్నది కూడా తేలాలి. స్వచ్ఛంద, నిర్బంధ పదవీవిరమణలు అమలు చేస్తారన్న ఉహాగానాల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాలి.

ఆర్టీసీతో ఇతర అంశాలు కూడా మంత్రివర్గం ముందుకు రానున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పంచాయతీరాజ్ శాఖలో 311, గిరిజన గురుకుల కళాశాలల్లో 1455 పోస్టులతో ఇతర పోస్టుల మంజూరుకు ఆమోదం తెలపనుంది.

ఇవీ చూడండి:వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!

Last Updated : Nov 28, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details