రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కొత్త సచివాలయ అంశమే ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది. పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. మిగిలిన జే, ఎల్ బ్లాక్ ల కూల్చివేత కూడా మరో 15, 20శాతం మాత్రమే ఉంది. ఒకటి, రెండు రోజుల్లో కూల్చివేత ప్రక్రియ పూర్తి కానుంది. అటు కొత్త సచివాలయ నిర్మాణ కసరత్తు కూడా కొనసాగుతోంది. నూతన భవన సముదాయ నమూనా ఖరారు కసరత్తు గత కొన్నాళ్లుగా జరుగుతోంది. ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... భవన నమూనాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. మంగళవారం కూడా నమూనాను సీఎం పరిశీలించారు. ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సచివాలయ భవన నమూనాను పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.
నియంత్రిత సాగు, కరోనా కట్టడిపై చర్చ
అటు నియంత్రితసాగుపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఈ సీజన్ నుంచే రాష్ట్రంలో నియంత్రిత సాగు అమలవుతుండగా... సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో పంటల సాగు సహా కొనుగోళ్లు, మార్కెటింగ్ సహా సంబంధిత అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం చర్చించనుంది. రోజురోజుకూ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలు, అందించాల్సిన చికిత్స సహా సంబంధిత అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. కొవిడ్ కారణంగా విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం, ప్రత్యామ్నాయ భోదనా పద్ధతులు, నూతన విద్యావిధానం, ప్రవేశాలు, ప్రవేశపరీక్షలపై సమావేశం చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.