రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా దాని వ్యాప్తిని నిరోధించడం, మళ్లీ లాక్‌డౌన్ విధించడం, ప్రత్యామ్నాయాలు తదితర కీలక అంశాలపై చర్చించేందుకు జులై ఒకటి లేదా రెండో తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిమండలి అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో చర్చించినట్లు తెలిసింది. దానిపై మంగళవారం స్పష్టత రానుంది.
పీవీకి భారతరత్నపై తీర్మానం
రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 15 రోజుల పాటు రాజధానిలో లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రికి వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే సిఫార్సు చేసింది. తదనుగుణంగా మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయంతో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న, పార్లమెంటులో ఆయన చిత్రపటం, తపాలా స్టాంపు విడుదల తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.అనంతరం స్వయంగా దిల్లీకి వెళతామని సీఎం ప్రకటించారు.