రాష్ట్రంలో కొనసాగుతున్న ఆస్తుల నమోదుకు మంత్రిమండలి గడువు పెంచింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి కానందున అక్టోబరు 20 తేదీ వరకు గడువును పొడిగించింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాలక మండలిలో 50 శాతం మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుంది. డివిజన్ల రిజర్వేషన్లు మరో అయిదేళ్ల పాటు కొనసాగుతాయి. గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించింది. చివరి గింజ వరకు ఎన్నిరోజులైనా కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ‘ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకోండి. తాలు, పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లండి’ అని రైతాంగాన్ని కోరింది.
కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా..
మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండా పోవడానికి కేంద్రం నిర్ణయాలు కారణమని మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయం. విశ్వ విపణిలో మొక్కజొన్న నిల్వలు ప్రజావసరాలకు మించి ఉన్నాయి. కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరింది. రిజిస్ట్రేషన్, నాలా చట్ట సవరణలకు మంత్రిమండలి అంగీకరించింది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో సమీకృత టౌన్‌షిప్‌ల ప్రోత్సాహక విధానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
జీహెచ్‌ఎంసీ చట్ట సవరణలో...
కొత్త పురపాలక చట్టానికి సంబంధించిన పలు నిబంధనలను జీహెచ్‌ఎంసీ-55 చట్టంలో చేర్చేందుకు వీలుగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో అమల్లో ఉన్న 50 శాతం మహిళా రిజర్వేషన్లను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. వార్డు కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించేలా కొత్త విధానం రూపుదాల్చనుంది. డివిజన్లలో రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయి.