తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపట్నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు - తెలంగాణ బడ్జెట్‌ 2021

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం కోసం ఉభయసభలు ఉదయం 11 గంటలకు ఉమ్మడిగా సమావేశవుతాయి. ఈ నెల 18న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పది నుంచి 15 రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

telangana assembly
telangana assembly

By

Published : Mar 14, 2021, 7:22 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక పద్దుపై చర్చ, ఆమోదం కోసం రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి రేపట్నుంటి సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశమవుతారు. ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రెండు సభల సభా వ్యవహారాల సలహాసంఘాలు విడివిడిగా సమావేశమవుతాయి.

15 రోజుల పాటు సమావేశాలు!

బడ్జెట్ సమావేశాల ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. పనిదినాలు, ఎజెండా, చర్చించే అంశాలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పది నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు దివంగత నోముల నర్సింహయ్యకు ఈ నెల 16న శాసనసభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 17న చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండే అవకాశం ఉంది.

18న బడ్జెట్​!

18న 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఏసీ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత బడ్జెట్​పై సాధారణ చర్చ, పద్దులపై చర్చతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ, ఆమోదంతో పాటు ఇతర అంశాలపై ఉభయసభల్లో చర్చ ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఇప్పటికే నిర్ణయించారు. అందరూ మాస్కులు విధిగా ధరించాల్సి ఉంటుంది.

కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్​ పరీక్షలు తప్పనిసరి చేశారు. సభలోపల, ప్రాంగణంలో రోజుకు రెండు మార్లు శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మారు సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. కరోనా కారణంగా గత బడ్జెట్ సమావేశాలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగ్ నివేదికను ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు. ఫలితంగా ఈసారి రెండేళ్లకు సంబంధించిన కాగ్ నివేదికలను ఉభయసభల ముందుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: శశాంక్ గోయల్

ABOUT THE AUTHOR

...view details