Telangana Budget 2022: వచ్చే నెల తొలివారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పద్దు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఇతరత్రాలకు సంబంధించిన ప్రగతిపద్దు కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఉద్యోగాల నియామకాలకు అవసరమైన మొత్తాన్ని నిర్వహణపద్దులో సర్దుబాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని బేరీజు వేసుకుంటూ... వచ్చే ఏడాది రెవెన్యూ రాబడులను అంచనా వేసుకొని బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు.
ప్రాథమ్యాలకు అనుగుణంగా..
2022-23లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా ఆయా శాఖలు, పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు చేయనున్నారు. అన్ని శాఖలను సంప్రదించి ఆర్థికశాఖ అధికారులు ప్రాథమిక కసరత్తు చేశారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఆదాయ, వ్యయాలపై అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. బడ్జెట్ రూపకల్పన కసరత్తుపై చర్చించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి, రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎం సమీక్ష అనంతరం బడ్జెట్ పద్దులకు సంబంధించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.