Health Index Telangana 2021 : దేశవ్యాప్త ఆరోగ్య సూచీ (2019-20)లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 69.96 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. 2018-19లో మూడో స్థానంలో ఉన్న ఏపీ.. ప్రస్తుతం 69.95 స్కోర్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
Health Index 2021 : ‘ఆరోగ్య రాష్ట్రాలు-ప్రగతిశీల భారతదేశం’ పేరుతో రాష్ట్రాల 4వ ఆరోగ్య సూచీ-2019-20 నివేదికను నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేష్‌అగర్వాల్, ప్రపంచ బ్యాంక్ సీనియర్ హెల్త్ స్పెషలిస్ట్ షీనాఛాబ్రా సోమవారం విడుదల చేశారు. ఈ సూచీలో కేరళ (82.20), తమిళనాడు (72.42) మొదటి రెండు స్థానాలు దక్కించుకోగా.. ఉత్తర్‌ప్రదేశ్ (30.57), బిహార్ (31) అట్టడుగున నిలిచాయి. మహారాష్ట్ర (69.14) అయిదో స్థానం దక్కించుకుంది. ప్రారంభం(2017) నుంచి ఈ సూచీలో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Telangana Rank in Health Index 2021 : ఆరోగ్య రంగంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును 24 సూచికల ఆధారంగా అంచనా వేశారు. అస్సాం మినహా 7 ఈశాన్య రాష్ట్రాలు, గోవాను కలిపి ఒక విభాగంగా; మిగిలిన 19 రాష్ట్రాలను (ఏపీ, తెలంగాణ సహా) పెద్ద రాష్ట్రాలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలను మరో విభాగంగా పరిగణించారు. అంటువ్యాధులు, నాన్‌కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.
తెలంగాణ పనితీరు మెరుగుకుకారణాలివీ..
Telangana Rank in Health Index 2019-20 : ‘‘చిన్నారులకు వంద శాతం టీకాలు వేయడం, శత శాతం జననాల నమోదు, క్షయ వ్యాధిగ్రస్థులను పూర్తిస్థాయిలో గుర్తించి, చికిత్స అందేలా చూడడం, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, ప్రసవాల గదులు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఉండడం, ప్రసూతి మరణాలు తగ్గడం’’ తదితర అంశాలు తెలంగాణ వార్షిక పనితీరు మెరుగుపడడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Telangana Health Index Rank : 2014-15 నుంచి 2019-20 మధ్య కాలంలో (పెద్ద రాష్ట్రాల విభాగంలో) 15 రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగగా అందులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2019-20లో తెలంగాణలో 96.3 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అదే సమయంలో గుజరాత్‌లో ఆసుపత్రి ప్రసవాల్లో క్షీణత అత్యధికంగా (-5.2 శాతం) ఉంది.
ఆరోగ్యరంగం పనితీరులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఇప్పటికే లక్ష జననాలకు 70 కంటే తక్కువ ప్రసూతి మరణాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాయి.