Modi Public Meeting in Hyderabad : హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలకు, సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌కు వెళ్లి పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు నోవాటెల్‌లో 270 గదులు కేటాయించారు. మరికొందరికి వెస్టిన్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎగ్జిక్యూటివ్ సూట్లు, ముఖ్యమంత్రులకు జూనియర్ సూట్లు కేటాయించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో 3న నిర్వహించే విజయ సంకల్పసభను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ బాధ్యతల్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీసుకున్నారు. మిగిలిన జిల్లాల నుంచి జనసమీకరణను బండి సంజయ్ భుజాన వేసుకున్నారు. కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే వారిలో 40 మందికి పైగా నాయకులు బుధవారమే హైదరాబాద్‌కు చేరుకుని, తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు.
విజయ సంకల్పసభకు రైళ్లు, బస్సులు..విజయ సంకల్ప సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 16 రైళ్లు, భారీ సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బుక్ చేసినట్లు సమాచారం. 10 లక్షల ఆహ్వానపత్రికలు ముద్రించిన పార్టీ గురువారం నుంచి వాటిని ప్రజలకు ఇచ్చి ఆహ్వానం పలకనుంది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 30 మందిని తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించిన భాజపా నాయకత్వం.. సంబంధిత బూత్ అధ్యక్షుడికే వారి ఆహార బాధ్యతల్ని అప్పగించింది.
నియోజకవర్గాల్లో నేతల ఆరా..జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే వారిలో 119 మంది సీనియర్ నాయకులను రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలకు ఒక్కొక్కరి చొప్పున భాజపా పంపుతోంది. వారు గురువారం నుంచి జులై 2వ తేదీ ఉదయం వరకు అక్కడే ఉంటారు. మోదీ సభకు జనసమీకరణ ఏర్పాట్లు చూడటంతో పాటు ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలాబలాలు తదితర అంశాలు, కార్యకర్తలు, ఆరెస్సెస్ నాయకులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం వీరు పార్టీ అధిష్ఠానానికి నివేదికలు ఇవ్వనున్నారు. ఈ నాయకులను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు, మూడు నెలలకోసారి ఇలాగే నియోజకవర్గాలకు పంపాలని భాజపా యోచిస్తోంది.