భాజపా తెలంగాణ వ్యవహారాల బాధ్యునిగా తరుణ్ చుగ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర బాధ్యునిగా ఉన్న కృష్ణదాస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యులు, సహ బాధ్యులను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జారీ చేసిన జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం విడుదల చేశారు. పంజాబ్‌కు చెందిన తరుణ్‌చుగ్ ఏబీవీపీ, భారతీయ జనతా యువమోర్చాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇటీవల నియమితులయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో దూకుడుగా ఉన్న పార్టీకి మరింత ఉత్సాహం నింపేందుకే చుగ్ వంటి చురుకైన నేతను నియమించారని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలున్న నేపథ్యంలో కొత్త బాధ్యుని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జాతీయ కార్యవర్గంలో చోటుదక్కని పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావును మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించారు.