కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్న తెలంగాణ విమోచన సభను విజయవంతం చేయాలని... భాజపా తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిశ్చయించింది. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో జరగనున్న ఈ సభకు లక్షల సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ప్రజా సంగ్రామ యాత్ర శనివారం 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా... సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భాజపా తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రజా సంగ్రామ యాత్ర, సెప్టెంబర్ 17న నిర్మల్ లో నిర్వహించనున్న సభ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలపై చర్చించారు. నిర్మల్ సభను లక్షలాది మందితో నిర్వహించి.. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపాయే అన్న స్పష్టమైన సందేశం ప్రజలకు చేరవేయాలని సమావేశం నిర్ణయించింది. ఇక బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగడంపై పార్టీ అగ్రనాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇకముందూ ఈ యాత్ర విజయవంతంగా కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అక్టోబర్ 7 వరకు వివిధ కార్యక్రమాలు..
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి... 20 వసంతాలు పూర్తి చేసుకుంటోన్న అక్టోబర్ 7 వరకు రాష్ట్ర పార్టీ, నాయకులు, కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తలపెట్టారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ చర్యలు... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగించమని ప్రతిజ్ఞ, వైద్య శిబిరాలు, వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.