ఈనెల చివరి వారంలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు(Telangana assembly sessions) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25లోపు ఉభయసభలు భేటీ కావాల్సి ఉండటం వల్ల.. గణేష్ ఉత్సవాలు పూర్తయ్యాక ఇవి సమావేశమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నోటిఫికేషన్ జారీపై నిర్ణయం..
రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిశాయి. అప్పట్నుంచి ఆర్నెళ్ల లోపు అంటే ఈ నెల 25వ తేదీ లోపు శాసనసభ, మండలి తిరిగి సమావేశం కావాల్సి ఉంది. జూన్ ఒకటో తేదీన ఉభయసభలను ప్రొరోగ్ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
గణేశ్ ఉత్సవాల తర్వాతే..
ఈ నెల పదో తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండటం వల్ల గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు(Telangana assembly sessions) జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ఈ నెల నాలుగో వారంలో ఉభయసభల సమావేశాలు ప్రారంభమవనున్నాయి.
ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..
ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. దళితబంధుతో పాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.