ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ భేటీ (Ts Assembly Sessions from today) అవుతుండగా.. సమావేశాల అజెండా ఇంకా ఖరారు కాలేదు. సమావేశాల తొలి రోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు శాసన సభ, మండలి సంతాపం ప్రకటించనున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, అజ్మీరా చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, కుంజా భిక్షం, మేనేని సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, రాజయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య మృతి పట్ల... సంతాపం ప్రకటిస్తూ సభాపతి తీర్మానాలు ప్రవేశపెడతారు. మాజీ ఎమ్మెల్సీలు లింబారెడ్డి, లక్ష్మారెడ్డి, హెచ్ రహ్మాన్, రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. ప్రొటెం ఛైర్మన్ తీర్మానాలు ప్రవేశపెడతారు.
పని దినాలపై నేడు స్పష్టత..
సంతాప తీర్మానాల అనంతరం.. ఉభయ సభలను వాయిదా వేస్తారు. పనిదినాలు, అజెండా ఖరారు చేసేందుకు శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు (BAC MEETINGS) విడివిడిగా భేటీ అవుతాయి. సమావేశాల పనిదినాలు, చర్చించే అంశాలపై బీఏసీ భేటీల్లో నిర్ణయం తీసుకుంటారు. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
చర్చకు ఎన్నో కీలక అంశాలు..
దళిత బంధు (DALIT BANDHU), జలవివాదాలు(AP-TS WATER DISPUTES), వ్యవసాయం, పంటల కొనుగోళ్లు, పోడు భూములు, ధరణి సమస్యలతోపాటు ఉద్యోగ నియామకాలు, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయలు, ఇతర అంశాలపై సమావేశాల్లో చర్చించాలని.. శాసనసభాపక్షాలు కోరనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల విషయమై కూడా స్పష్టత రానుంది. గృహనిర్మాణసంస్థ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టసవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు, పర్యాటకుల కోసం టౌటింగ్ చట్టం బిల్లు, పురపాలక, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. రెండు ఆర్డినెన్స్‌లు, చలన చిత్ర అభివృద్ధి, ట్రాన్స్‌కో, డిస్కంలు, పవర్ ఫైనాన్స్, పర్యాటకాభివృద్ధి సంస్థల వార్షిక నివేదికలతోపాటు... సమగ్ర శిక్ష ఆడిట్ నివేదికను మంత్రులు ఉభయసభల ముందు ఉంచనున్నారు.
అధికార, ప్రతిపక్షాలు సిద్ధం..
అసెంబ్లీ సమావేశాల్లో (Ts Assembly Session).. దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మరోపక్క ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. సభలు, సమావేశాలు, పాదయాత్రలు జోరందుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రభుత్వం దళితబంధుపై చర్చను ప్రధానాంశంగా తీసుకోనుంది. యాదాద్రి జిల్లా వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలం చొప్పున ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించింది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించే బిల్లు సందర్భంగా ఈ అంశాలపై చర్చకు అవకాశం ఉంది. ఇతర వర్గాలకూ ఇలాంటి పథకం తేవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
డ్రగ్స్ కేసులు సహా..
కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలుకు నిరాకరించడం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర వైఖరి, కృష్ణా, గోదావరి బోర్డులపై నోటిఫికేషన్ జారీ వంటి వాటిపైనా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్ వంటి అంశాల పైనా చర్చించే వీలుంది. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కోరిన తరుణంలో వాటిపైనా చర్చించనున్నారు.
మొత్తం 8 బిల్లులు..
మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దళితబంధుకు చట్టబద్ధత, పర్యాటకులు, ప్రయాణికులకు దళారుల ఆగడాలను నిలువరించేలా తీసుకొస్తున్న ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలను సవరిస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు పెట్టనుంది. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులు ఉభయసభల ముందుకు రానున్నాయి. కాంగ్రెస్ కనీసం 20 రోజులైనా సభ నిర్వహించాలని ఒత్తిడి తేవాలని చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే తమ ఎజెండాగా భాజపా ప్రకటించింది. నిరుద్యోగం, పంటలసాగు, కొనుగోళ్లు, ధరణి పోర్టల్ సమస్య, రెండు పడకగదుల ఇళ్లు, శాంతిభద్రతలు తదితరాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగింపు, ఆయన రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. గత ఏడాదిన్నరగా అనుసరిస్తున్నట్లే ఈసారీ కరోనా నిబంధనలను పాటిస్తూ సమావేశాలు జరుగుతాయి.
ఇదీచూడండి:Telangana assembly sessions 2021 : రేపటి నుంచి శాసనసభ సమావేశాలు.. ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష