కేంద్రం తెచ్చే కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం తేవొద్దని భాజపా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తిని అడ్డంగా నరికే చట్టమని విమర్శించారు. కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని శాసనసభలో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
'కేంద్ర చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాలి. రాష్ట్రంలోని 26 లక్షల బోర్ల కొత్త మీటర్ల కోసం రూ.700 కోట్లు కావాలి. మీటర్ రీడింగ్ తీస్తారు.. ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తారు. ఒకప్పుడు బిల్లు కలెక్టర్‌ను చూస్తే రైతులు ఎంతో భయపడేవారు. మన రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త చట్టంలో రెన్యుబుల్ విద్యుత్ 20 శాతం ఉండాలని నిబంధన ఉంది. ఆ చట్టం ద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్ కొనాలి. కొనకపోతే 50 పైసల నుంచి రూ.2 వరకు జరిమానా వేస్తారు.'