ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిగింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులతో పాటు ఇతర బిల్లులు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విషయంలో రాష్ట్రంలో 25వ స్థానంలో ఉందన్న తెరాస సభ్యుడు రాజేందర్ రెడ్డి... ప్రస్తుత విశ్వవిద్యాలయాలు ఎలాంటి పరిశోధనలు లేకుండా తహసీల్దార్ కార్యాలయాల్లా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెరాస నేతలకే ఇచ్చారు
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు ఆరోపించారు. అధ్యాపక ఖాళీలను భర్తీ చేయకపోగా... కనీసం ఉపకులపతులను కూడా నియమించలేదని విమర్శించారు. తెరాస మేనిఫెస్టోలోని కేజీ టు పీజీ ఉచితవిద్య అంశానికి భంగం కలగడం లేదా అని ప్రశ్నించిన ఆయన... ఎంత మంది పేదలకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఐదింటిలో మూడింటిని తెరాస నేతలకే ఇచ్చారని, వివాదాస్పద భూముల్లోని సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చారని శ్రీధర్ బాబు అన్నారు.
త్వరలోనే నియామక ప్రక్రియ
బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... మొత్తం 16 ప్రతిపాదనల్లో అన్నింటినీ పరిశీలించి ఐదింటికి అనుమతులు ఇచ్చామని, మరో మూడు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. కొత్త వాటికి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించబోదని తెలిపారు. ఫీజుల నిర్ధరణ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉంటారన్న మంత్రి... రాష్ట్ర విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను సర్కార్ అలక్ష్యం చేయడం లేదని, న్యాయవివాదాల వల్లే ఉపకులపతులు, అధ్యాపకుల నియామకం ఆలస్యమైందని వివరించారు. త్వరలోనే వీసీల నియామక ప్రక్రియ పూర్తవుతుందని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపడతామని మంత్రి పేర్కొన్నారు.
నిపుణుల కొరత దృష్ట్యా
విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయోపరిమితి పెంచేందుకు, కరోనా నేపథ్యంలో అదనంగా అప్పులు తీసుకునే బిల్లులును సభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. పదవీవిరమణ వయోపరిమితి పొడిగింపు ఏమేరకు సబబని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క... బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల్లో నిపుణుల కొరత దృష్ట్యా అధ్యాపకుల వయో పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కరోనాతో ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల కేంద్రం ఇచ్చిన వెసులుబాటుకు అనుగుణంగా అదనపు అప్పు కోసం చట్టసవరణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.