పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉభయసభల ఏకగ్రీవ తీర్మానం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. పార్టీలకు అతీతంగా ఆమోదం తెలిపారు. పీవీకి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే భారతరత్న ఇచ్చి దేశం తనను తాను గౌరవించుకోవాలన్న సీఎం... పార్లమెంటు ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాని పదవి చేపట్టిన తొలి దక్షిణాది వ్యక్తిగా.. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండోవ్యక్తి పీవీ సేవలు చిరస్మరణీయమన్నారు.
పర్యటక కేంద్రంగా పీవీ గ్రామం
పీవీ నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర మరుగునపడేశారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఎందరో తెలంగాణ వైతాళికులు మరుగునపడ్డారన్నారు. తెలంగాణ వైతాళికులను గౌరవించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. తెలంగాణ ముద్దుబిడ్డల ఔన్నత్యం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. పీవీతో ఉన్న అనుబంధాన్ని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేసుకున్నారు. ఆయన స్వగ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
విపక్షాల మద్దతు
ఆర్థిక పరిస్థితి గాడి తప్పినప్పుడు గుర్తుకొచ్చేది పీవీనే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసించారు. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు సంస్కరణలు తెచ్చారన్నారు. భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న తీర్మానానికి కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు తెలిపారు. భాజాపా సభ్యుడు రాజాసింగ్ సహా ఇతర విపక్ష నేతలు దేశానికి పీవీ చేసిన సేవలు స్మరించుకుంటూ.. భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి మద్దతు తెలిపారు.
మండలిలో తీర్మానం
పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరుతూ.. శాసనమండలిలో మంత్రి ఈటల రాజేందర్ తీర్మానం ప్రవేశపెట్టారు. రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో పీవీ శత జయంతి సందర్భంగా చర్చ జరిగింది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని ఈటల పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీ అని అధికార, విపక్ష సభ్యులు కొనియాడారు. పీవీ శతజయంతి ఉత్సవాలపై చర్చ, తీర్మానానికి మద్దతు ఇవ్వలేని కారణంగా శాసనసభ, మండలి సమావేశాలను ఒక్కరోజు బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది.
ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం