తెలంగాణ

telangana

ETV Bharat / city

నివేదికల్లోనే అనిశా కేసులు - no action is taken on bribers

అవినీతికి పాల్పడి పక్కా ఆధారాలతో పట్టుబడినప్పటికీ కనీసం శాఖాపరమైన చర్యలు చేపట్టని పరిస్థితులు ఉన్నాయి. అవినీతి నిరోధకశాఖ నమోదు చేసిన కేసులు తదుపరి చర్యలకు నోచుకోవడం లేదు.

acb is failed to take action against corrupted officers
నివేదికల్లోనే అనిశా కేసులు

By

Published : Jun 9, 2020, 6:33 AM IST

ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు పక్కా ఆధారాలతో పట్టుబడిన పలువురు అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాయని సుపరిపాలన వేదిక గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. తదుపరి చర్యలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలివ్వాలంటూ కేసులకు సంబంధించిన వివరాలను వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అందజేశారు.

అవినీతి కేసుల్లో మూడు నెలలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆర్నెల్ల కాలంలో అనిశా విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నివేదికపై ప్రభుత్వం 45 రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సంబంధిత శాఖలకు చేరిన దస్త్రాలు ఏళ్ల తరబడి కార్యాలయాల్లో మగ్గిపోతున్నాయన్నారు.

గవర్నర్‌కు సుపరిపాలన వేదిక చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కేసులు ఇవే..

  • 2009 నవంబరులో రవాణాశాఖకు చెందిన ఓ అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అనిశా కేసు నమోదు చేసింది. అనంతరం ఆ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం విచారణకు అనిశాకు అనుమతి ఇవ్వలేదు. శాఖాపరమైన విచారణకు ఉత్తర్వు ఇవ్వగా అనిశా అభ్యంతరం తెలపడంతో 11 ఏళ్లుగా కేసులో ముందడుగు పడటంలేదు.
  • 2010లో గిరిజనాభివృద్ధి సంస్థకు చెందిన ఓ అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉంది. పురపాలకశాఖకు చెందిన ఓ అధికారి అవినీతికి పాల్పడుతూ పట్టుబడగా.. ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు అనుమతి ఇచ్చింది. చివరికి కేసును ప్రభుత్వం మూసివేసింది.
  • 2015లో పరిశ్రమల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు అనిశా వలకు చిక్కగా ఇప్పటికీ ఆ అధికారులను విచారణ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
  • 2016లో నీటిపారుదల శాఖలో నకిలీ ధ్రువపత్రాలతో పనులు చేసి నిధులు కాజేశారన్న ప్రచారంతో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. మరో ఉత్తర్వుతో విచారణను నిలిపివేసింది. ఇప్పటికీ కేసు ముందుకు కదలలేదు.
  • రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న ఓ అధికారిపై 2011లో అనిశా కేసు నమోదు చేసింది. సదరు అధికారిని విచారించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా... ఆరేళ్ల తర్వాత 2017లో ఆ కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details