తెలంగాణ

telangana

ETV Bharat / city

అర్ధాంతరంగా ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ, ఏపీ అధికారులు - కేఆర్‌ఎంబీ సమావేశానికి హాజరుకాని అధికారులు

KRMB
KRMB

By

Published : Oct 17, 2022, 11:56 AM IST

Updated : Oct 17, 2022, 7:43 PM IST

11:52 October 17

అర్ధాంతరంగా ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ, ఏపీ అధికారులు

KRMB Meeting Today: ఎలాంటి చర్చ లేకుండానే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై ఆధ్వర్యంలో హైదరాబాద్ జలసౌధలో కమిటీ ఐదో సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరద జలాల లెక్కలు, రూల్ కర్వ్స్‌కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేసేందుకు గతంలోనే ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. వివిధ కారణాల రీత్యా సమావేశం వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఆర్ఎంసీ ఐదో సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. అయితే ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తమకు వీలు కాదని, మరో రోజు సమావేశం నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు. ఇటు తెలంగాణ అధికారులు సైతం ఆర్ఎంసీ సమావేశంపై అసంతృప్తిగా ఉన్నారు. తమ అభిప్రాయాలను పొందుపరచడం లేదని, తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎంసీ సమావేశంలో పాల్గొనడం వల్ల ఏం ఫలితం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చడంతో పాటు తాము కోరిన సమాచారం ఇచ్చిన తర్వాతే సమావేశం నిర్వహించాలని ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల అధికారులు ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు రానప్పటికీ ఆర్కే పిళ్లై నేతృత్వంలో సమావేశం జరిగింది. కేవలం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన అధికారులు మాత్రమే సమావేశంలో ఉన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల వైఖరిపై సమావేశంలో పిళ్లై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని, బోర్డును లెక్క చేయడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. త్వరలోనే మరోమారు సమావేశం నిర్వహిస్తానని, ఎప్పుడు నిర్వహించాలనేది ఈమారు రెండు రాష్ట్రాలను అడుగుతానని పిళ్లై అన్నట్లు తెలిసింది. అప్పుడు సమావేశానికి ఎలా రారో తాను చూస్తానని ఆర్కే పిళ్లై వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details