Minister Niranjan Reddy in Maharashtra Tour: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. మూడో రోజు జల్గావ్‌లోని జైన్ మైక్రో డ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ పార్కు, ప్రపంచంలోనే అతిపెద్ద టిష్యూ కల్చర్ ల్యాబ్, ఉల్లి విత్తన క్షేత్రాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం జైన్ సంస్థల ఎండీ అజిత్ జైన్‌లో భేటీ అయ్యారు. జల్గావ్ స్పూర్తితో తెలంగాణలో అరటి సాగును ప్రోత్సహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు కోసం కృషి చేస్తున్నామని ఈ సమావేశంలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి 'కొంతమంది కర్షకులు అరటిసాగు వైపు మళ్లినా.. మిగతా రైతులకు అది దారి చూపుతుంది. సీఎం కేసీఆర్ రైతును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకున్నామని...పప్పు, నూనె గింజల వంటి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను మళ్లిస్తున్నాం. ఆఫ్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు అంతర్జాతీయ విపణిలో మంచి డిమాండ్ ఉంది. జైన్ సంస్థ తెలంగాణలో పరిశ్రమలు పెడితే సంపూర్ణ సహకారం అందిస్తాం.'
-నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి
రెండో రోజు పర్యటనలో భాగంగా..
Niranjan Reddy in Maharashtra Tour: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. రెండో రోజు జల్గావ్ సమీపంలోని జైన్ హిల్స్ లో.. ఉద్యాన సాగు, ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూ కల్చర్ మొక్కల తయారీ.. అల్లం, ఆలు, టొమాటో పంటల సాగును మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. పంటల సాగుతో పాటు.. వాటి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఎంతో ముఖ్యమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయానికి.. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతకు అండగా నిలుస్తున్నాయని.. మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి 'ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొక్కలు ఉద్యానపంటల వైపు మళ్లుతున్న రైతాంగానికి ఎంతో ఉపయోగకరం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల వైవిద్యీకరణ మీద దృష్టి సారించామని... పంటల మార్పిడి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ల్యాబ్‌లు ఎంతో అవసరం. 544 మిల్లీమీటర్ల అతి తక్కువ వర్షపాతం ఉన్న జల్గావ్లో నీటి వినియోగం తీరు రైతాంగానికి ఆదర్శం. ఇక్కడ పెద్ద ఎత్తున ఫాం పాండ్లు నిర్మించుకుని వాటిలో ఒడిసిపట్టుకున్న నీటితోనే పంటలు పండించుకుంటున్నారు. కేసీఆర్ చొరవ వల్ల తెలంగాణ రైతాంగానికి సాగునీటి గోస తీరిందని...రైతులు సాంప్రదాయ పంటల సాగును వదిలేసి.. లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలి. జైన్ సంస్థ స్ఫూర్తితో తెలంగాణలో పంటల మార్పిడి దిశగా రైతులను తీసుకెళ్తాం.'
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉన్నతాధికారులు సరోజిని దేవి, సుభాషిణి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజారాం మహాజన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందు మహాజన్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:KCR on yasangi: 'యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాల్సిందే'