వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా గత సీజన్‌కన్నా ప్రస్తుత యాసంగిలో ( paddy cultivation in Yasangi)ఇంకా ఎక్కువ సాగయ్యే అవకాశాలున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ చెబుతోంది. ఈసారి మొత్తం 68.16 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు కావచ్చని అంచనా వేసింది. యాసంగి పంటల సాగు ప్రణాళిక సన్నద్ధతపై వ్యవసాయశాఖ(telangana agriculture department) నివేదిక తయారుచేసింది.
ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేస్తారు, దాని దిగుబడి ఎంత ఉండవచ్చనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఈసారి వరి సాగు 52.80 లక్షల ఎకరాలుంటుందని అధికారులు వివరించడం గమనార్హం. గతేడాది (2020) యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వేయగా ఈ ఏడాది అంతకన్నా మరో 2,350 ఎకరాలు దాటవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. వరి విస్తీర్ణం జిల్లాల వారీగా ఎంతమేర తగ్గిస్తారనే గణాంకాలను విడుదల చేయలేదు. ఈ విషయమై తమకు ఇంకా ఆదేశాలు రాలేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు-ఈటీవీభారత్కు చెప్పారు. మరోవైపు అన్ని పంటలకూ కలిపి 10.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంటాయని వ్యవసాయశాఖ తెలిపింది. విత్తనాలను రాయితీపై విక్రయిస్తారా అనే విషయాన్ని ప్రకటించలేదు.
'వరి వేయడమంటే.. ఉరి వేసుకోవడమే..'
ఉప్పుడు బియ్యంపై కేంద్రం తాజా నిర్ణయంతో.. రైతులు ఇక ముందు వరి పంట సాగుచేయడం మంచిది కాదని ఇటీవల నిర్వహించిన వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఏడాది ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్రం అంగీకరించినా.. ఈ యాసంగిలో వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే అభిప్రాయం వ్యక్తమైందని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.
‘‘గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిద్వారా సుమారు 1.40 కోట్ల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉంది. వీటి దృష్ట్యా పీడీఎస్ తదితర అవసరాల మేరకు, కేంద్రం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుంది. కరోనా వల్ల రైతులు నష్టపోరాదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసల కోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో కేంద్రం నిర్ధారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలి. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలి’ అని సమావేశం అభిప్రాయపడింది.
సంబంధిత కథనాలు..