కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత అన్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని... ఈత కొలనులు, ఎంటర్ టైన్మెంట్ పార్కులు, థియేటర్లు కూడా తెరవరాదని స్పష్టం చేసింది. ఆన్లైన్, డిజిటల్ విధానంలో బోధనకు అనుమతించిన ప్రభుత్వం... ఈ నెల 21 నుంచి కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావచ్చని తెలిపింది. 9 నుంచి 12 తరగతుల వరకు విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యాసంస్థలకు వెళ్లవచ్చని పేర్కొంది.
నిబంధనలకు లోబడి..
వంద మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడా, సాంస్కృతిక, వినోద, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు నిబంధనలకు లోబడి జరుపుకోవచ్చన్న ప్రభుత్వం... అప్పటి వరకు పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేసింది. 21 తర్వాత ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరవవచ్చని, సెప్టెంబరు 7 నుంచి నియంత్రిత విధానంలో మెట్రో రైళ్లు నడపవచ్చని పేర్కొంది. బార్లు, క్లబ్బులు తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.