అన్‌లాక్ 5 కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి పలు రకాల ఇన్స్టిట్యూషన్లు, బహిరంగ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు కఠిన లాక్ డౌన్ అమలవుతుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల సామాజిక, అకడమిక్, క్రీడా, సాంస్కృతిక, ఎంటర్టైన్మెంట్, మతపరమైన, రాజకీయపరమైన కార్యక్రమాలకు వంద మందితో కూడిన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించింది. అయితే ఆయా కార్యక్రమాల్లో తప్పని సరిగా మాస్కులు ధరించటంతోపాటు... భౌతిక దూరం పాటించాలని సూచించింది.
అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం - telagana Unlock-5 latest news
19:57 October 07
అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కళాశాలలు, ఉన్నత విద్యాలయాలు ఈ నెల 31వరకు ఆన్ లైన్ తరగతులే కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్ల పున ప్రారంభానికి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పీహెచ్డీ స్కాలర్లు, ల్యాబరేటరీల్లో పరిశోధనలు చేయాల్సి ఉన్న టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న పీజీ విద్యార్థుల కోసం ఈ నెల 15 నుంచి ఉన్నత విద్యాలయాలు ప్రారంభించవచ్చని స్పష్టం చేసింది. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గానూ కొవిడ్ నియమాలను పాటిస్తూ... ఈ నెల 15 నుంచి స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతులు జారీ చేసింది.
వందమందికి మించితే అనుమతి కావాలి
ఎంటర్టైన్మెంట్ పార్కులు, సినిమా హాళ్లు, మల్టిప్లెక్సులకు సంబంధించిన ప్రత్యేక ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. బీ టు బీ ఎగ్జిబిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చని... అయితే మాస్కులు, థర్మల్ స్కానర్లు తప్పని సరిగా వినియోగించాలని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాల వంటి కార్యక్రమాలకు వంద మందికి మించి హాజరయ్యేందుకు స్థానిక కలెక్టర్ లేక ఆరోగ్య, పోలీసు శాఖల నుంచి అనుమతులు తప్పనిసరని పేర్కొంది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అన్ లాక్ 5 నిబంధనల్లో ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి :శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్