- ఇరవై ఏళ్ల మహేందర్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. తన కోరిక తీర్చేందుకు అంగీకరించలేదనే కోపంతో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన బాలిక తలను చెట్టుకేసికొట్టి, అపస్మారస్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేసి చంపేశాడు.
- గత డిసెంబరు నెలలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల కుర్రాడు. అదే వయసు బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి 12 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హతమార్చాడు.
- ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మద్యానికి బానిసైన కొడుకు రాముడు.. తల్లి చంద్రమ్మ తల నరికి పారిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్‌స్టేషన్ పరిధిలో తల్లి శంకరమ్మను, కుమారుడు లింగయ్య తలపై కొట్టి హత్య చేశాడు.
Teenage Criminals : మద్యం.. డ్రగ్స్.. అశ్లీల చిత్రాలు.. ఇవన్నీ కౌమార వయసు పిల్లలను నేరాలబాట పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా నేరస్థులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెలిసీ తెలియని వయసులో యువతలో పెరిగిపోతున్న విశృంఖలత్వం ఫలితంగా పలు ఘోరాలు జరుగుతున్నాయి. చిన్నవయసులోనే మద్యం, డ్రగ్స్‌కు అలవాటుపడడం, ఆ మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడటం మామూలైపోయిందని పోలీసు అధికారులే అంగీకరిస్తున్నారు.
సర్వేలో తేలిన ‘నగ్న’సత్యం :అంతర్జాల సదుపాయం అందుబాటు, డాటా వేగం పెరిగిన తర్వాత చాలామంది యువత అశ్లీల చిత్రాలకు అతుక్కుపోతున్నారు. ‘దిశ’ ఉదంతం జరిగిన తర్వాత పోలీసు అధికారులు నిర్వహించిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జులాయిగా తిరుగుతున్న యువతకు సంబంధించి సర్వే నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి గ్రామంలో అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తుమందులకు అలవాటుపడ్డ యువత పదుల సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. వీరందరిపై నిఘా ఉంచాలన్న ఆదేశాలు అటకెక్కాయని, యువతలో నేర ప్రవృత్తి పెరగడానికి అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తుమందులే ప్రధాన కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘‘అలాంటి వాళ్లంతా నేరాలకు పాల్పడకపోయినప్పటికీ అవకాశం దొరికినప్పుడు మాత్రం నేరాలు చేసేందుకు వెనకాడటం లేదు. ఉదాహరణకు అశ్లీల చిత్రాలకు అలవాటుపడ్డ వారు అవకాశం చిక్కినప్పుడు చాటుమాటుగా బంధువులు, స్నేహితులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడో, స్నానం చేస్తున్నప్పుడో సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని చూపి బెదిరించడమో, లేదంటే తోటివారితో ఈ దృశ్యాలను పంచుకోవడమో చేస్తున్నారు. ఇది తప్పు అనే ఆలోచన లేనంతగా అశ్లీల సంస్కృతి వారి మానసిక పరిస్థితిపై పెత్తనం చేస్తోందని’ ఆ అధికారి విశ్లేషించారు. చక్కదిద్దేందుకు ప్రయత్నించకపోతే ఈ తరహా నేరప్రవృత్తి క్రమంగా పెరుగుతుందన్నారు.